పంజాగుట్ట, వెలుగు: పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని మాజీ ప్రొఫెసర్ ఆర్ఎస్ ప్రసన్నకుమార్ విమర్శించారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన ప్రొఫెసర్లను అకారణంగా బదిలీ చేస్తున్నారని తెలిపారు. అర్హత లేని వారికి ఉన్నత పోస్టులు కట్టబెట్టి, అన్ని అర్హతలు ఉన్న వారిని విధుల నుంచి తప్పించడమేమిటని ప్రశ్నించారు. లంబాడా, దళిత వర్గానికి చెందిన సిబ్బందిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
ఎస్టీ వర్గానికి చెందిన ప్రొ.బాలజీ, ప్రొ.రమణకు అన్యాయం జరిగిందని, దీనిపై తాను ప్రశ్నిస్తే తనకు ఉద్యోగం రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వారి వేధింపులతోనే తాను వీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ, బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తూ తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వీసీ, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. డా. రమణ, మామిళ్ల నిఖిత, క్రాంతి కుమార్, అలెగ్జాండర్ పాల్గొన్నారు.
