అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..80 తులాల బంగారం, 5.5 కేజీల వెండి స్వాధీనం

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..80 తులాల బంగారం, 5.5 కేజీల వెండి స్వాధీనం

సిద్దిపేట రూరల్, వెలుగు: పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్  జిల్లా దొంగను సిద్దిపేట పోలీసులు అరెస్ట్  చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్  స్టేషన్ పరిధిలో గత నెల 28న జరిగిన చోరీ కేసులో దొంగను అరెస్ట్  చేసి 80 తులాల బంగారం, 5.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్​ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన చిక్కుడు కృష్ణ(వెంగాలి భిక్షపతి) గత నెల 28న దుబ్బాక పట్టణానికి చెందిన తీర్థయాత్రలకు వెళ్లిన చింత రాజ్ కుమార్  ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్  చేసి 80 తులాల బంగారం, ఐదున్నర కిలోల వెండి, నగదు రికవరీ చేశారు. భిక్షపతి ఇటీవల నిజామాబాద్  జైలు నుంచి విడుదలవగా, దీనికి జైలు కానిస్టేబుల్  గోపాల్  సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. కానిస్టేబుల్ ను ఈ కేసులో ఏ2 చేర్చి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భిక్షపతిపై సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్  జిల్లాల్లో 63 కేసులు ఉన్నట్లు తెలిపారు.