శివ చరణ్ రెడ్డి వివాదంపై త్రీమెన్ కమిటీ

శివ చరణ్ రెడ్డి వివాదంపై త్రీమెన్ కమిటీ
  •     కమిటీ సభ్యులు మధు యాష్కి, జగ్గారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి భేటీ

హైదరాబాద్, వెలుగు: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి బీసీ కులాలను కించపరిచేలా మాట్లాడడం, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంపై పీసీసీ త్రీమెన్ కమిటీని నియమించింది. ఇందులో మాజీ ఎంపీ మధు యాష్కి, జగ్గారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి సభ్యులుగా ఉన్నారు. బుధవారం ఈ ముగ్గురు ఇందిరా భవన్‌‌‌‌లో సమావేశమై చర్చించారు. ఇందులో శివ చరణ్ రెడ్డి, ఆయన తండ్రి కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే శివ చరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ షోకాజ్ నోటీసు ఇవ్వగా, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు పంపించింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై మధు యాష్కీ, జగ్గారెడ్డి, చల్లా నర్సింహా రెడ్డి చర్చించి మరోసారి సమావేశమై, నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. 

సమావేశం అనంతరం మధు యాష్కీ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకంగా బీసీ కులాలను కించపరిచేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఆవేశంతో మాట్లాడితే అది పార్టీకి నష్టం చేస్తుందని, నాయకులు అన్నప్పుడు ఆవేశాన్ని అణచుకొని  మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ... ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని చెప్పారు. ఈశ్వరమ్మకు బోర్డులో మెంబర్‌‌‌‌‌‌‌‌గా అవకాశం ఇవ్వడంతో యాదవ సమాజం కాంగ్రెస్‌‌‌‌కు సన్మానం చేయాల్సిన పరిస్థితుల్లో... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే యాదవ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ఇకనుంచి ఎవరూ కులాల ప్రస్తావన తీసుకురావద్దని కోరారు.