- దీక్ష విరమించాలని అడగొద్దని మద్దతుదారులకు మెసేజ్
- 19 రోజులకు చేరిన వాంగ్ చుక్ నిరాహార దీక్ష
- మరింత క్షీణించిన వాంగ్‌చుక్ ఆరోగ్యం
- ప్రమాదకర స్థాయికి పడిపోయిన బీపీ, షుగర్ లెవెల్స్
- వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిపై నిరసన శిబిరంలో ఆందోళన
దీక్ష విరమించాలని అడగొద్దని మద్దతుదారులకు వాంగ్ చుక్ మెసేజ్.. నీట్ విద్యార్థులకు సపోర్టుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ పరిస్థితి మరింత క్షీణించింది. 19 రోజుల ఆమరణ నిరాహార దీక్షలో వాంగ్ చుక్ బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని మద్దతుదారులు కోరుతున్న క్రమంలో వాంగ్ చుక్ తాజా ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు.
వీడియో మేసేజ్ లో తన నిరాహార దీక్షను విరమించమని కోరవద్దని వాంగుచుక్ మద్దతుదారులను కోరారు. దీక్షకు బదులుగా జూలై 20న పార్లమెంట్ వరకు చేపట్టనున్న ‘చలో సంసద్’ శాంతియుత యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.
నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. గురువారం నాటికి దీక్ష 19వ రోజుకు చేరుకోవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన బరువు 9 కిలోలకు పైగా తగ్గి 57.15 కిలోలకు పడిపోయింది. ప్రస్తుతం 59 ఏళ్ల వాంగ్‌చుక్ 24 గంటల వైద్య పర్యవేక్షణలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు.
తాజా మెడికల్ ప్రకారం వాంగ్ చుక్ రక్తపోటు 105/61 mmHg, రక్తంలో చక్కెర 80 mg/dL, ఆక్సిజన్ స్థాయి 97 శాతానికి పడిపోయాయి. వాంగుచుక్ స్పృహలోనే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య మరింత క్షీణించిందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చుక్‌తో పాటు పలువురు విద్యార్థి నేతలు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కొందరు ఆస్పత్రిలో చేరినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. దీంతో నిరసన శిబిరంలో ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
