హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, బీఎల్వోలకు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫామ్‌లలో పొరపాటున కొన్ని వివరాలను తప్పుగా నింపడంతో ఆయా ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్‌లలో పొరపాట్లపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్లారిటీ ఇచ్చారు.
తప్పులుంటే ఫామ్–8 ద్వారా సవరణ
ఎన్యూమరేషన్ ఫామ్‌లలో ఏవైనా పొరపాట్లు ఉంటే ‘సర్’ పూర్తయిన తర్వాత ఫామ్–8 ద్వారా సవరణలు చేసుకోవచ్చని ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఇప్పుడు పేర్లు ఎలా ఉన్నా కూడా ఫామ్స్ ఇస్తే ఓటు కోల్పోకుండా ఉంటుందన్నారు. ఆగస్టు 3 వరకు ఫామ్స్ అందివ్వవచ్చని, ఆగస్టు 10న ఓటరు ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్ లిస్ట్) విడుదల చేస్తామని, ఫామస్ సమర్పించిన వారందరి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు.
ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 లోపు ఎన్నికల నమోదు అధికారికి (ఈఆర్‌వో) సూచించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలని చెప్పారు.
ఫైనల్ డ్రాఫ్ట్ అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్‌లో బీఎల్‌వోలపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవడంతో, ఆ ఓటర్లను ప్రత్యేకంగా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘సర్’కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1950 కి కాల్ చేయవచ్చన్నారు.
