ఈవీ చార్జింగ్ చేస్తుండగా మంటలు.. నోయిడాలో ఇద్దరు మృతి

ఈవీ చార్జింగ్ చేస్తుండగా మంటలు.. నోయిడాలో ఇద్దరు మృతి
  • నోయిడాలోని ఓ బిల్డింగ్​ సెల్లార్​లో భారీ అగ్నిప్రమాదం
  • షార్ట్ సర్క్యూటే కారణమన్న పోలీసులు

లక్నో: నోయిడాలోని మామూరా గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని (ఈవీ) చార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్​లోని పార్కింగ్ ఏరియాలో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల్లోనే పక్కన ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించాయి. దీంతో భవనం అంతటా దట్టమైన పొగ అలుముకుంది. అప్రమత్తమైన అధికారులు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్న కుటుంబాలను సేఫ్​గా బయటకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈవీకి చార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న పెట్రోల్ వాహనాలకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 50 కుటుంబాలను ఖాళీ చేయించామని పేర్కొన్నారు. అయితే, పొగ కారణంగా ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మరణించారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బిల్డింగ్​ యజమాని సహా ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

దర్యాప్తు జరపండి: సీఎం యోగి

నోయిడా అగ్నిప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించా లని ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.