హైదరాబాద్: జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగుకు నీరు వదిలేస్తే వచ్చే ఎండ కాలంలో తాగునీటి పరిస్థితి ఏంటని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. సోమవారం (సెప్టెంబర్ 21) గాంధీభవన్‌లో జూరాల ప్రాజెక్ట్ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవక ప్రాజెక్టుల్లోకి ఒక్క చుక్క నీరు రావట్లేదని చెప్పారు. జూరాల ఆయుకట్టుకు నీటి ఎద్దడి ఉన్నది వాస్తవమేనని.. ఎగువ నుంచి ప్రాజెక్ట్‌కు నీరు రావడం లేదని తెలిపారు.
ఆల్మట్టి నుంచి నీటి విడుదల కోసం కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని సాగుకు వదిలేస్తే తాగు నీరు ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడు సాగుకు వదిలేస్తే వచ్చే ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
ఈ పరిస్థితికి బీఆర్ఎస్సే కారణం:
జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరు ఇవ్వకపోవడానికి కారణం బీఆర్ఎస్సేనని మంత్రి జూపల్లి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల దగ్గర 21 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి కనీసం ఒక్క టీఎంసీ రిజర్వాయర్ కూడా నిర్మించలేదన్నారు. ఆ రోజు కేసీఆర్ రిజర్వాయర్ నిర్మించి ఉంటే ఈ రోజు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు ముందే సూచించామని తెలిపారు.
కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం:
కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వాడుకుంటుందని కేటీఆర్ అంటున్నారు.. అసలు ఇరిగేషన్ పై అవగాహన ఉండే ఆయన అలా మాట్లాడుతున్నారా అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలను తెలంగాణ కంటే ఎక్కువ ఏపీ వాడుకుందని ఆరోపించారు. రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు.. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం లాగ్ బుక్‌లను చూడనివ్వలేదని ఎద్దేవా చేశారు.
►ALSO READ | ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తం.. భారీగా పోలీసుల మోహరింపు
