బుల్లితెరపై 'మహాభారత్'లో ధర్మసంస్థాపన కోసం గద పట్టిన 'భీముడు'.. బాలీవుడ్ 'బ్రహ్మాస్త్ర'లో జోర్‌గా మెరిసిన విలన్, WWE రెజ్లర్ సాంగా అలియాస్ సౌరవ్ గుర్జర్ చిక్కుల్లో పడ్డారు. రియల్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌తో కటకటాలపాలయ్యాడు. ఓ 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని, నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలపై అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో మొదలైన ఈయన రొమాంటిక్ లవ్ స్టోరీ.. చివరకు విమానాశ్రయంలో హైడ్రామాతో ముగిసి, నగర పోలీసుల లాకప్ వరకు వెళ్లింది.
అసలేం జరిగిందంటే?
2021లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ 29 ఏళ్ల యువతికి, సౌరవ్‌కు పరిచయం ఏర్పడింది. క్రిస్మస్ రోజున మొదటిసారి కలుసుకున్న వీరి బంధం, మెల్లగా డీప్ లవ్‌గా మారింది. 'నిన్నే పెళ్లి చేసుకుంటా.. నా భార్యగా నీకు అన్ని హక్కులూ ఇస్తా' అంటూ కలల రాకుమారుడిలా మాట ఇచ్చాడు. తనకి అప్పటికే పెళ్లయిందనే నిజం దాచలేక చెప్పినా.. మనం కలిసి కొత్త వ్యాపారం పెడదాం, నా కోసం ఇండియా వచ్చేయ్ అని ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మి, ఆ యువతి ఏకంగా అమెరికాలోని తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ఇండియాకు తిరిగొచ్చింది.
పోలీసుల కస్టడీలో..
అయితే, అక్టోబర్ 2025 నుండి మార్చి 2026 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటూ ఆమెతో సహజీవనం చేశారు సౌరవ్.. కానీ పెళ్లి ప్రస్తావన రాగానే అసలు రంగు బయటపెట్టాడు. ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తూ ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది.
ALSO READ : ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ.. రచ్చ లేపనున్న ‘నారాయణమ్మ’ స్పెషల్ సాంగ్!
దీంతో పోలీసులు అతనిపై భారతీయ న్యాయ సంహిత' (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేశారు. దుబాయ్ నుండి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సౌరవ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టుకుని, హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ రీల్ భీముడు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో జైలు గోడల మధ్య ఊచలు లెక్కిస్తున్నాడు..
