గిరిజన యువతకు కార్పొరేట్‌‌ కొలువులు..ఉట్నూర్‌‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్‌‌ మేళా

గిరిజన యువతకు కార్పొరేట్‌‌ కొలువులు..ఉట్నూర్‌‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్‌‌ మేళా
  •     225 మందిని ఎంపిక చేసుకున్న ఎంఎన్​సీలు
  •     నైపుణ్యం ఉంటే ఉపాధికి ఢోకా లేదు: పీవో మకరందు

గుడిహత్నూర్, వెలుగు: గిరిజన, గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌‌రంగంలో అవకాశాలు కల్పిస్తూ ఆదిలాబాద్​జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ముందడుగు వేసింది. చదువుకు నైపుణ్యం తోడైతే ఉద్యోగాలు రావడం కష్టమేమీ కాదని నిరూపిస్తూ.. బుధవారం ఉట్నూరులోని యూత్‌‌ ట్రైనింగ్‌‌సెంటర్‌‌లో నిర్వహించిన మెగా జాబ్‌‌ మేళాలో భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభించింది. కుమ్రం భీం కాంప్లెక్స్‌‌ ప్రాంగణం వైటీసీలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్‌‌ మేళాను ఐటీడీఏ పీవో మంద మకరందు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రైవేట్‌‌ రంగంలో వస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.  ఐటీడీఏ ఆధ్వర్యంలో మరిన్ని  జాబ్‌‌ మేళాలు నిర్వహిస్తా మని తెలిపారు. 

820 మంది నిరుద్యోగులు హాజరు

ఉదయం 10 గంటలకు మొదలైన ఇంటర్వ్యూలకు 820 మంది గిరిజన నిరుద్యోగులు తరలివచ్చారు. 20 ప్రముఖ కార్పొరేట్‌‌ సంస్థల ప్రతినిధులు హాజరై వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 225 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకోగా.. వారికి పీవో మకరందు, జేడీఎం మేనేజర్‌‌ నాగభూషణం నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో (జనరల్‌‌) వసంతరావు, డీడీ ప్రేమకళ, ఏపీవో (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డీఎంజీ సందీప్‌‌ కుమార్, అడిషనల్ డీఎంహెచ్‌‌వో మెస్రం మనోహర్, ఈఈ తానాజీ, డిప్యూటీ డీఈవో చందన్, పెసా కోఆర్డినేటర్‌‌ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.