గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి.. కామారెడ్డి జిల్లా వడ్డేపల్లి శివారులో ప్రమాదం

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి.. కామారెడ్డి జిల్లా వడ్డేపల్లి శివారులో ప్రమాదం

కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​మండలం వడ్డేపల్లి శివారులో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. 

నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జుంజూరి రమేశ్ (24) మేనమామ శివయ్య నాలుగు రోజుల కింద చనిపోయాడు. దశదినకర్మ కోసం అవసరమైన సామాను తీసుకొచ్చేందుకు రమేశ్ తన బంధువైన జుంజూరి దినేశ్ (25)తో కలిసి బైక్ పిట్లం వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి గోర్గల్​కు వస్తున్నారు. వడ్డేపల్లి శివారులోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో దినేశ్ అక్కడికక్కడే చనిపోగా, రమేశ్​తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రమేశ్ ను నిజామాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 

లారీని ఢీకొట్టిన కారు, ఏఆర్ కానిస్టేబుల్.. 

గజ్వేల్, వెలుగు : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఏఆర్ కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​రింగ్​రోడ్డు సమీపంలో పాతూరు జంక్షన్​వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణంలోని గణేశ్​నగర్ కు చెందిన ఆరె కిరణ్​(35) సిద్దిపేట ఏఆర్​విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విధుల్లో ఉన్నారు. 

మంగళవారం రాత్రి సిద్దిపేట నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నాడు. పాతూరు జంక్షన్ సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.