నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దళిత సామాజికవర్గానికి ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటిక భూమి విషయంలో అభ్యంతరం తెలుపుతున్న వీడీసీ తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ బక్కి వెంకటయ్య సీరియస్ అయ్యారు. దళితవర్గాలపై విధించిన బహిష్కరణపై బుధవారం ఆయన గ్రామానికి చేరుకొని విచారించారు. శ్మశాన వాటిక భూమిని ఉపయోగించకుండా అడ్డుపడుతున్న వీడీసీ తీరును ప్రశ్నించిన ఎస్సీలపై బహిష్కరణ విధించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమను ఎవరూ కూలీ పనులకు పిలువొద్దని హుకుం జారీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నమన్నారు. వీడీసీ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగడంలేదని వాపోయారు. స్పందించిన వెంకటయ్య మాట్లాడుతూ.. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. బాధితుల కంప్లయింట్మేరకు కేసులు నమోదు చేసిన మొత్తం 48 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరున సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే హైపవర్ మీటింగ్‌లో వీడీసీల ఆగడాలను ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు. కమిషన్‌సభ్యుడు రాంబాబు నాయక్, డీఆర్వో గీత, ఏసీపీ ప్రకాశ్యాదవ్తదితరులు ఉన్నారు.
