- పోలీసుల అదుపులో తండ్రితో పాటు మేనమామ
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడి హత్య జరిగింది. తన ఇద్దరు కూతుళ్లను వేధిస్తున్నాడని ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపల్లి భాస్కర్(32) ఇంటర్ వరకు చదువుకొని 8 ఏండ్ల కింద నగరానికి వచ్చాడు.
ప్రస్తుతం మాదాపూర్‌లోని శ్రీశ్రీ సూట్స్ అనే హోటల్లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తమ్మడబోయిన రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు, భాస్కర్ 2020 నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. విషయం తెలిసిన యువతి తండ్రి తన కూతురు జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినా భాస్కర్ తీరు మారకపోవడంతో వరంగల్ జిల్లా పర్వతగిరి, వర్ధన్నపేట స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు.
ఈక్రమంలో 2023 మేలో రాజు తన పెద్ద కూతురిని కాజీపేట్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెండ్లి చేశాడు. విషయం తెలుసుకున్న భాస్కర్ యువతి చేసిన మెసేజ్ స్ర్కీన్ షాట్లను ఆమె భర్తకు పంపించగా, గొడవలు జరిగి మూడు నెలల కింద విడాకులు తీసుకున్నారు. ఆమె ఇటీవల యూపీఎస్సీ ప్రిపరేషన్స్ కోసం బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న చెల్లెలి వద్దకు వచ్చింది. కాగా, ఇటీవల రాజు చిన్న కూతురికి భాస్కర్ ఆమె అక్క గురించి అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టాడు. చిన్న కూతురి పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వేధించసాగాడు.
విషయాన్ని తండ్రికి చెప్పడంతో భాస్కర్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేశారు. మృతుడి సోదరుడు మధు ఫిర్యాదు మేరకు నిందితులపై అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజు, అతని బావమరిది కుమారస్వామి, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉంటే భాస్కర్, రాజు పెద్ద కూతురు ప్రేమించుకున్నారని తమది తక్కువ కాబట్టి పెండ్లి చేయలేదని మృతుడి సోదరుడు తెలిపాడు. బుధవారం ఓ గుడిలో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించారని, ఇంతలోనే భాస్కర్‌ను దారుణంగా హత్య చేశాడని పేర్కొన్నాడు. తన తమ్ముడిది పరువు హత్యేనని ఆరోపించాడు.
ఉప్పరపల్లిలో ఉద్రిక్తత
వర్ధన్నపేట: భాస్కర్ హత్యతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పరపల్లిలో ధర్నా నిర్వహించారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉప్పరపల్లిలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
