భారత్‌లో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన వన్‌ప్లస్ బ్రాండ్ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో ఒకప్పుడు శామ్‌సంగ్, ఆపిల్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఈ బ్రాండ్.. ఇప్పుడు భారత మార్కెట్‌తో పాటు విదేశీ కార్యకలాపాలను కూడా క్రమంగా తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
2027 నాటికి భారత్ నుంచి నిష్క్రమణ?
మాతృసంస్థ ఒప్పో(Oppo) చేపడుతున్న గ్లోబల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వన్‌ప్లస్ చైనాలో మాత్రమే కొనసాగి, అమెరికా, యూరప్‌తో పాటు భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 2027 నాటికి వైదొలిగే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో రియల్‌మీ చైనా మార్కెట్‌ను వీడే అవకాశమూ ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక నివేదిక పేర్కొంది.
ఎందుకు ఈ నిర్ణయం?
ఒప్పో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై ఆర్థిక ఒత్తిడి పెరగడం, అమెరికా, యూరప్, భారత్ వంటి కీలక మార్కెట్లలో అమ్మకాలు బలహీనపడటం, స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అలాగే అమెరికాలో చైనా కంపెనీలపై ఉన్న భౌగోళిక-రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒప్పో గ్లోబల్ వ్యూహాన్ని ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
వన్‌ప్లస్ స్పందన ఏమిటి?
ప్రస్తుతానికి భారత్ నుంచి నిష్క్రమణపై వన్‌ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియూ వాటిని ఖండిస్తూ.. "భారత్‌లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి" అని స్పష్టం చేశారు.
వన్‌ప్లస్ మెుబైల్ యూజర్లపై ప్రభావం?
ఈ వార్తలు నిజమైతే భవిష్యత్తులో కొత్త వన్‌ప్లస్ ఫోన్ల విడుదల, సర్వీస్ నెట్‌వర్క్, స్పేర్ పార్ట్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌లో వన్‌ప్లస్ ఫోన్ల అమ్మకాలు, సర్వీసెస్ యథావిధిగా కొనసాగుతున్నాయి. కాబట్టి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సమాచారాన్ని నివేదికల ఆధారంగా వచ్చిన అవకాశంగానే చూడాలని నిపుణులు అంటున్నారు.
