భారత్‌లో E20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి వినియోగదారుల కోర్టు ఒక కేసులో కీలక తీర్పును వెలువరించింది. రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఒక కారు యజమానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. E20 పెట్రోల్ వినియోగించిన తర్వాత తన వాహనంలో ఇంజిన్ పనితీరు దెబ్బతిందని, తరచూ మిస్‌ఫైరింగ్, పెర్ఫామెన్స్ తగ్గడం, ఇంజిన్ సమస్యలు తలెత్తాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. అనేక సార్లు రిపేర్లు చేయించినా సమస్యలు తగ్గకపోవడంతో భారీ ఖర్చు భరించాల్సి వచ్చిందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు.
తయారీ సంస్థ వాదనను తోసిపుచ్చిన కమిషన్..
ఈ కేసులో వాహన తయారీ సంస్థ, డీలర్ మాత్రం తమ వాహనం E20 పెట్రోల్‌కు పూర్తిగా అనుకూలమని, ఇంజిన్ సమస్యలకు ఇంధనం కారణం కాదని వాదించారు. సాధారణ అరుగుదల, నిర్వహణలో లోపాలు, ఇతర సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్యలు వచ్చాయని కోర్టుకు చెప్పారు. అయితే కమిషన్ ఈ వాదనను అంగీకరించలేదు. వినియోగదారుడు పలుమార్లు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించినప్పటికీ అదే సమస్యలు మళ్లీ మళ్లీ రావడం, లోపాన్ని సరిచేయడంలో సంస్థ విఫలమైందని కమిషన్ పేర్కొంది.
E20 మాత్రమే అమ్మటంపై కీలక కామెంట్స్..
తీర్పులో కమిషన్ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ మాత్రమే ప్రధానంగా అందుబాటులో ఉందని, వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవటంపై కూడా కోర్టు స్పందించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రకాల పెట్రోల్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ20 పెట్రోల్ వాడకుండా ఉండాలని వాహనదారులను ఆశించడం న్యాయసమ్మతం కాదని కమిషన్ స్పష్టం చేసింది.
పరిహారం చెల్లించాలని ఆదేశాలు..
వినియోగదారుడి ఫిర్యాదును సమర్థించిన కమిషన్.. వాహన తయారీ సంస్థతో పాటు డీలర్ కూడా వాహన మరమ్మతుల కోసం చేసిన ఖర్చును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేదనకు పరిహారం, లీగల్ ఖర్చులను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తాలను చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తీర్పు ఈ20 పెట్రోల్ వాడకం, వాహన అనుకూలత, తయారీ సంస్థల బాధ్యత, వినియోగదారుల హక్కులపై దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయ్యాయి. దీంతో మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఈ20 పెట్రోల్, గడ్కరీ చెబుతున్న వాదనలకు కోర్టు తీర్పు పెద్ద ఛాలెంజ్‌గా మారిందనే చెప్పాలి.
