- విడివిడిగా ఉండడం వల్ల రెండు విభాగాల మధ్య లోపిస్తున్న సమన్వయం
- ఈ అంశంపై సెక్రటేరియెట్‌లో మంత్రి దామోదర సమీక్ష
- రాష్ట్రానికి అనువైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు విడివిడిగా ఉండటం వల్ల సమన్వయ లోపం ఏర్పడుతోందని, అందుకే వీటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, ల్యాబ్ టెస్టులు, చట్టపరమైన చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈ నేపథ్యంలోనే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రానికి అనువైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడబోం.. కల్తీ ఆహారం, నకిలీ మెడిసిన్ అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను ఆధునీకరించడంతో పాటు, అవసరమైన చోట రీజనల్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
‘‘తప్పు చేసే వారికి కఠిన శిక్ష పడే వరకు డిపార్ట్‌మెంట్ వదలకూడదు.. ఇందుకోసం లీగల్ టీమ్ ను స్ట్రాంగ్ చేయాలి’’ అని స్పష్టం చేశారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు నిపుణుల నియామకానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అయితే, నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లు, రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, అదే సమయంలో హైదరాబాద్ ఫార్మా, వ్యాక్సిన్ రంగాల బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేలా మంచి ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీసీఏ డీజీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
