వెలుగు ఓపెన పేజీ.. పూరీ జగన్నాథుని వైభవం అద్వితీయం

వెలుగు ఓపెన పేజీ.. పూరీ జగన్నాథుని వైభవం అద్వితీయం

శ్రీ జగన్నాథుడి ప్రార్థనలు,  కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి.  పాఠశాలలో,  కళాశాలలో  చదువుకునేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్నిచ్చేది.  మహాప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్న అనుభూతి కలిగేది.  నేను ఈ మధ్య భజనలు పాడటం లేదు.  కానీ,  ప్రతిరోజూ ఆ మహాప్రభుని స్మరిస్తాను.  భజనలోని  ఓ నాలుగు పదాలైనా పలకని రోజుండదు.  నిజానికి  మహాప్రభు  నాకు దగ్గరగా ఉన్నట్టు  భావిస్తుంటాను.  కష్ట సమయాల్లో ఆయన నాకు అండగా ఉన్నారు.  ఈనాటికీ భక్త కవి  మధుసూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను.

 ‘అంతటా ఉండే ఓ మహాప్రభూ... నువ్వు రాత్రింబగళ్లు నాతోటే ఉన్నావు... ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను నా పూర్ణ హృదయంతో..’ అని ఆ పాటకి అర్థం.  లౌకిక విషయాలు అర్థం చేసుకునే వయసు వచ్చేనాటికి మహాప్రభు జగన్నాథుని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను.  మహాప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడుకునేవారు.  మా గ్రామంలోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగుతుండేవి.  నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్ రచించిన ‘ఆహే నీల శైల’ అనే ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేవారు.  

మహాప్రభు జగన్నాథుని గురించి మా టీచర్ అనేక విషయాలు చెప్పేవారు.  ‘పూరీలో పెద్ద ఆలయం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర,  సోదరుడు బలభద్రునితో కలసి మహాప్రభు  పూజలందుకుంటారు.  మహాప్రభు జగన్నాథుడు నల్లని రంగులో,  గుండ్రని కళ్లతో ఉంటారు.  సుభద్ర పసుపు రంగులో,  బలభద్రుడు  వెన్నెల్లో  వికసించిన  పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు.  ఒక్కసారి ఆ మూర్తులను చూస్తే.. ఎప్పటికీ మరచిపోం’ అని చెప్పేవారు.  జగన్నాథుడే మహాప్రభువనీ,  ఆయన ప్రసాదమే మహా ప్రసాదమని కూడా మా టీచర్ చెప్పేవారు.  ఆయన ఆలయమే ‘బడ దేవుళ’  లేదా  పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే  ఉత్కృష్ట మార్గం.   

 గుండిచా ఆలయంలో 7 రోజులు

మయూర్భంజ్ జిల్లాలోని  మా ఊరు ఉపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేడా నుంచి పురుషోత్తమ  క్షేత్రం- పూరీ  చాలా దూరంలో ఉంటుంది.  మరి పూరీని  సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది?  నేను పెద్దయ్యాక  భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లాను.  అక్కడ  బాలికల ఉన్నత  పాఠశాల యూనిట్–2లో  చేరాను.  అక్కడే వసతిగృహంలో ఉండేదాన్ని.  అక్కడ ఉన్నప్పుడే  పూరీ,  భువనేశ్వర్,  కోణార్క్  సందర్శించే  అవకాశం  నాకు లభించింది.  మొదటిసారి  మహాప్రభును  దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ  నా మదిలో స్పష్టంగా ఉంది.  

ఎంత అద్భుతమైన ఆలయం!  ఎంత తేజోవంతమైన  దేవతామూర్తులు!  వాటిని మరచిపోగలమా?  ఎవరైనా  మహాప్రభు జగన్నాథుని రథయాత్రను మరచిపోగలరా?  శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో  పదమూడు ఉత్సవాలు జరుగుతాయి.  కానీ రథయాత్ర వైభవం మాత్రం అద్వితీయం. మహాప్రభు దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. 

కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి  విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తులకు దర్శనమిస్తారు.  మూడు అద్భుతమైన రథాలపై.. చక్రరాజ  సుదర్శనునితోపాటు.. ముగ్గురు  దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడు రోజులు ఉండి,  తిరుగు  ప్రయాణమవుతారు. అత్యంత వైభవోపేతమైన ఈ మహాప్రభు ఉత్సవానికి సాటి లేదు. 

రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో...

నా చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని.  నేను అత్యంత భక్తిభావంతో కొలిచే  దైవం ఆయన. నా జీవితంలో ఒడిదొడుకులను నిర్ణయించేది ఆయనే.  నా  సుఖదుఃఖాలకు ఆయనే మూలం. నా జీవితంలో ఎన్నో కష్టాలను  ఎదుర్కొన్నాను.  ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు.  ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా.   భారత రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహాప్రభుని తలుచుకున్నాను. 

‘నన్ను ఇంత  పెద్దస్థాయికి తీసుకెళుతున్నావు.  నన్ను ముందుకు నడిపించు.  ఎప్పుడూ నాతోనే ఉండు’ అని ప్రార్థించాను.  ఆయన నా మొర ఆలకించారు.  నా ప్రార్థనకు ఆయన ఎప్పుడూ స్పందిస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో  రథయాత్ర ఉత్సవం జరిగింది.  నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న శ్రీ జగన్నాథుని  ఆలయానికి వెళ్లాను.  మహాప్రభు దర్శనం చేసుకున్నాను. 

 నా హృదయం ఆనందంతో  ఉప్పొంగిపోయింది.  ఆయన నాపై తన ఆశీస్సులను కురిపించారు. పూర్తి విశ్వాసంతో నేను నామినేషన్ దాఖలు చేశాను. అత్యంత ఉత్సాహంతో  ఎన్నికల  ప్రచారంలో  పాల్గొన్నాను.  2022 జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకి వెళుతూ... దారిలో నేను మహాప్రభు జగన్నాథుని స్మరిస్తూనే ఉన్నాను. ఆయన ఆశీస్సులతో  కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 

అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ క్షేత్రరాజం పూరీ

రాష్ట్రపతిగా  నేను  మొదటిసారి  ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది. అయినప్పటికీ.. మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది.  రోజులు  గడిచిపోతున్నాయి కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు.  ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది.  ‘మహాప్రభూ!  నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి.  

దయచేసి నన్ను పూరీకి పిలిచి.. మీ దర్శన భాగ్యం ఇవ్వండి’ అని  మౌనంగా ప్రార్థించాను. భావాలకు లేదా భావోద్వేగాలకు కూడా ఆయనే మహాప్రభు.  నా ఆలోచనలను ఆయన ఎలా అర్థం చేసుకోకుండా ఉంటారు?  అనతికాలంలోనే  పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబర్ 10.   పూరీకి  చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీ మందిర్ దిశగా ముందుకు వెళుతోంది.  పూరీలోని బడ దాండ వద్దకు  చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. బడ దాండ శ్రీ జగన్నాథునిది. ఇక్కడ ప్రొటోకాల్  
పాటించాల్సిన అవసరం ఉందా?  అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ  క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది.  

దేవుళ్లకే  దేవుడు  మహాప్రభు.  ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను.     ఏం  జరుగుతుందో  మిగిలినవారికి అర్థమయ్యేలోపే.. చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను. అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం,  పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకుసాగాను.

ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు

ముందుకు నడుస్తూనే.. రోడ్డుకిరువైపులా ఉన్న బాలలు, మహిళలు, యువత, పెద్దలకు నమస్కరిస్తూనే ఉన్నాను.  కానీ  నా దృష్టి మాత్రం మహాప్రభుమీదే ఉంది.  ఆలయ సింహద్వారానికి చేరుకునేసరికి.. నేను స్థిమితంగా ఉండలేకపోయాను.  అప్పటికే  నన్ను నేను  మరచిపోయాను. బడ దాండ మీద  దుమ్ములోనే  సాష్టాంగ నమస్కారం చేసి... ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను.  ఆ  తర్వాత  నేను గుడిలోకి  వెళ్లాను.  

గర్భగుడికి చేరుకొని దేవతామూర్తులను  దర్శనం చేసుకుని,  దైవికానందంతో ఉప్పొంగిపోయాను.  ఈ విశ్వానికి రక్షకుడు మహాప్రభువే.  అందరూ వదిలేసినవారికి కూడా ఆయనే రక్షకుడు.  లోకంలోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ  సిద్ధంగానే ఉంటారు.  అందుకే  ఆయన  విశాలమైన గుండ్రటి నేత్రాలు  ఎప్పుడూ రెప్ప వాల్చవు.  ఆయనకి పెద్దా, చిన్నా తారతమ్యం లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే..  సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు  నన్ను నేను అంకితం చేసుకున్నాను.  గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ.. ‘ఓ మహాబాహూ! ప్రజలకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు’ అని చేతులు జోడించి ప్రార్థించాను.  ఇలా  చెబుతూ భక్తిభావంలో  లీనమైపోయాను. 

- శ్రీమతి ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.