వెలుగు ఓపెన్ పేజీ.. సర్ ప్రక్రియకు పారదర్శకత అవసరం

వెలుగు ఓపెన్ పేజీ.. సర్ ప్రక్రియకు పారదర్శకత అవసరం

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా ప్రజలు సాధించిన హక్కు అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కు.  ఐదేళ్లకోసారి  ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి,  అధికారాన్ని  ప్రశ్నించే హక్కు,  ప్రజా వ్యతిరేక విధానాలు  అనుసరించిన  పాలకులను శిక్షించే  అధికారం,  ప్రజల తీర్పును  ప్రకటించే  సాధనం ఓటు.  అలాంటి  ఓటు హక్కుకు ఆధారమైన ఓటర్ల జాబితాల సవరణ  ప్రక్రియ అత్యంత  పారదర్శకంగా,  నిష్పాక్షికంగా,  ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ జరగాలి.  కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రక్రియ కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తోంది.  ప్రజలను ఒక ప్రశ్న వేధిస్తోంది.

‘నా పేరు ఇప్పటికే  ఓటర్ల జాబితాలో ఉంది.  మరి నేను  మళ్లీ  ఏం చేయాలి?  ఈ ప్రశ్నకు  ప్రతిప్రాంతంలో  ఒకే  సమాధానం లేదు.  ఒక అధికారి ఒకలా చెబుతున్నారు,  మరొక అధికారి మరోలా చెబుతున్నారు.  బూత్ లెవల్ అధికారులు చెప్పేది వేరు,  రాజకీయ పార్టీలకు అందుతున్న  సమాచారం వేరు,  సామాజిక  మాధ్యమాల్లో ప్రచారం మరింత వేరు. ఈ పరిస్థితుల్లో సాధారణ ఓటరు ఎవరిని నమ్మాలి? సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి  అత్యంత  సున్నితమైన ప్రక్రియలో  పనిచేసే  క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ,   స్పష్టమైన  మార్గదర్శకాలు ఇవ్వడం అత్యంత అవసరం.  కానీ  చాలాచోట్ల  సిబ్బందే సందిగ్ధంలో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  ఏ పత్రాలు తీసుకోవాలి?  ఏ సందర్భంలో  ఏ ఫారం ఉపయోగించాలి?  ఏ పత్రం సరిపోతుంది?  ఏది సరిపోదు?  వంటి  విషయాల్లో ఏకరీతి అమలు కనిపించకపోతే,  ప్రజల్లో అనుమానాలు పెరగడం సహజం.

పత్రాల పేరుతో ఇబ్బందులు

పేదలు,  వృద్ధులు,  దివ్యాంగులు,  వలస కూలీలు,  అద్దె ఇళ్లలో  నివసించే  కుటుంబాలు,  ఒంటరి  మహిళలు వంటి వర్గాల వద్ద అవసరమైన అన్ని పత్రాలు వెంటనే ఉండకపోవచ్చు.  అలాంటి  పరిస్థితుల్లో  వారికి సహాయం చేయాల్సింది పోయి,  పత్రాల పేరుతో  ఇబ్బందులు కలిగితే అర్హులైన ఓటర్లు వ్యవస్థకు  దూరమయ్యే  ప్రమాదం ఉంది.  
ప్రస్తుత వివరాలు తీసుకొని ఓటు హక్కు  కల్పిస్తామనే  భరోసా  కరువయింది.  గతంలో  దేశంలోని  పలు రాష్ట్రాల్లో  ఓటర్ల జాబితాల  సవరణ సందర్భంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు  వ్యక్తమయ్యాయి.  అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించాయన్న  ఆరోపణలు వచ్చాయి.   ఎన్నికల  తర్వాత  వేలాది మంది తమ పేర్లు జాబితాలో  లేకపోవడంతో  పోలింగ్ కేంద్రాల వద్ద నిరాశకు  గురైన  సంఘటనలు,  నిరసన  ప్రదర్శనలు  చర్చనీయాంశమయ్యాయి. అలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని,  పారదర్శకతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.  సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రక్రియలో  ప్రతి చర్య  పారదర్శకంగా ఉండాలి.  

ఓటు తొలిగితే...  హక్కు కోల్పోయినట్లే

ఒక  పౌరుడి పేరు  ఓటర్ల  జాబితా నుంచి అన్యాయంగా  తొలగిపోతే,  అది  కేవలం పరిపాలనా పొరపాటుకాదు. అది ఆ వ్యక్తి రాజ్యాంగబద్ధమైన  ప్రజాస్వామ్య హక్కుపై  ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే ఓటర్ల జాబితా  సవరణలో అత్యంత జాగ్రత్త అవసరం.  ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రజలకు స్పష్టమైన  సమాచారం అందించడం తమ బాధ్యతగా భావించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం ఎంత ముఖ్యమో, ఓటర్ల జాబితా నిష్పాక్షికంగా రూపొందడం అంతకంటే ముఖ్యమైనది.   ప్రతి అర్హుడైన  ఓటరుకి తన హక్కు సురక్షితంగా ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.  

ఒక నిమిషానికి 17 మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. అంటే  ప్రతిరోజు  ఓటరు లిస్ట్ నుంచి తీసేసే సంఖ్య  ఎంతో  తేలిపోతుంది.  కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోదు.  గ్రామాలలో చనిపోయిన వారి వివరాలు స్థానిక పంచాయతీ సిబ్బంది దగ్గర ఉంటుంది కాబట్టి వారి పేర్లను తొలగించొచ్చు.  కానీ ఎన్నికల కమిషన్ అసమర్థతవల్ల వారి పేర్లను తొలగించకపోవడం జరుగుతున్నది.  

రాజకీయ పార్టీలు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  దృష్టి పెట్టాలి

రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లుగా  నమోదైనవారిలో 3,38,18,717 మందికి అంటే 99,98 శాతం ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇచ్చామని చెబుతున్నారు, అందులో వాస్తవం లేదు.  పత్రాలు బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోల వద్ద ఉన్నాయి.  కానీ  ఓటర్లకు అందినవి 60 శాతం దాటలేదు.  జులై 13 నాటికి 1.44,70,788 మంది ఓటర్లు పత్రాలను దాఖలు చేశారు.  మిగతా 1,93,47,929 మంది ఓటర్లు ఎప్పుడు ఇస్తారో  తెలియని పరిస్థితి.   కీలకమైన మేడ్చల్ జిల్లాలో 14 శాతం,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 శాతం,  రంగారెడ్డిలో 28 శాతం ఓటర్స్ మాత్రమే తమ వివరాలు నమోదు చేశారు. రాజకీయ పార్టీల తరఫున  బీఎల్​ఏలు అంతగా పనిచేస్తున్నట్లు కనిపించడంలేదు.  పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు యుద్ధప్రాతిపదికన  సర్  కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఓటు తొలగించిన తరువాత మళ్లీ నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని ఎన్నికల కమిషన్ చెబుతున్నా  ప్రజలు మాత్రం నమ్మడం లేదు.   సర్  నిబంధనల ప్రకారం బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు  మూడుసార్లు ఓటర్స్ ఇంటికి వెళ్ళాలి.  కానీ ఒక్కసారి కూడా వెళ్లని ప్రాంతాలు ఉన్నాయి.  ఒకే దగ్గర కూర్చొని పత్రాలు తీసుకుపోతున్నారు, ఇచ్చి పోతున్నారు.

ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలి 

రెండు ఓట్లు ఉంటే  శిక్షిస్తామని  ప్రకటిస్తున్న ఎన్నికల కమిషన్  నిర్లక్ష్యంగా ఉండకూడదు.  రెండు ఓట్లు  ఉంటే.. నమోదు కావడానికి, కొనసాగడానికి సహకరిస్తున్న కమిషనే బాధ్యత వహించాలి.  భారత  ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఓటు నమోదు  ప్రక్రియ  తమ బాధ్యత కాదు.. ఓటురుదే బాధ్యత అని స్పష్టం చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకం.  అర్హత గల ఒక్క ఓటరు నమోదు కాకున్నా,  అర్హత లేని, మరణించిన.  డబుల్ ఓట్లు ఉన్నా ఎన్నికల కమిషన్  బాధ్యత  వహించాలి. ఎన్నికల కమిషన్  తెలంగాణలో  సర్  గడువును  ఆగస్టు 3 వరకు  పొడిగించింది.  దీంతో  బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు వచ్చే నెల 3వ తేదీ వరకు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్నారు. ఈ క్రమంలో  అర్హత ఉన్న ఓటరును నమోదు  చేయించడానికి, అనర్హత ఓటర్లను  తొలగించడానికి  ఈసీ, ప్రభుత్వం, బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు,  ప్రజలు సంయుక్తంగా  పని చేస్తే తప్ప అనుకున్న లక్ష్యం నెరవేరదు.

- దేవీప్రసాద్, మాజీ కార్పొరేషన్ చైర్మన్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.