వచ్చే నెల నుంచి అన్ని అంగన్‌‌వాడీల్లో బ్రేక్‌‌ఫాస్ట్ : సీతక్క

వచ్చే నెల నుంచి అన్ని అంగన్‌‌వాడీల్లో బ్రేక్‌‌ఫాస్ట్ : సీతక్క
  •     కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ స్కీమ్‌‌ సక్సెస్ అయింది: సీతక్క
  •     చిన్నారుల హాజరును పెంచేందుకు ‘అమ్మ మాట- అంగన్‌‌వాడీ బాట’ నిర్వహించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌‌వాడీ సెంటర్లలో బ్రేక్‌‌ ఫాస్ట్ స్కీమ్‌‌ను అమలు చేయాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని అంగన్‌‌వాడీ సెంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్‌‌ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి మాట్లాడారు. బలమైన భవిష్యత్తుకు బాల్యమే పునాది అని, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, చిన్నారుల హాజరును పెంచేందుకు ‘అమ్మ మాట– అంగన్‌‌వాడీ బాట’కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇప్పటికే మంజూరైన 2,500 కొత్త అంగన్‌‌వాడీ భవనాలను త్వరగా పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టు చేస్తాం.. 

అంగన్‌‌వాడీ సెంటర్ల పనితీరుపై పర్యవేక్షణ పెరగాలని, జిల్లా అధికారులు, సూపర్‌‌వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఆహార నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు స్వయంగా అంగన్‌‌వాడీల్లో భోజనం చేయాలని సూచించారు. గుడ్లు, పాలు, ఇతర సరుకుల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. తెలంగాణ బాల్య వివాహ రహిత రాష్ట్రంగా నిలవాలని, ఎక్కడైనా వివాహం జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.