- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌డీఎస్‌ఏకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల భద్రతపై చేపట్టిన సమగ్ర సాంకేతిక అధ్యయనం వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ), రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎస్.శరత్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటన తర్వాత ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన ముందస్తు చర్యలు అత్యవసరమని తెలిపారు. ఎన్‌డీఎస్ఏ తనిఖీ అనంతరం చేసిన సిఫార్సులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల నీటి వృధాతో పాటు ప్రాజెక్టు నిర్మాణ భద్రత కూడా దెబ్బతింటోందని పేర్కొన్నారు.
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణ స్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టకుండా రాజకీయ చర్చలకే పరిమితమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. నీటి ప్రవాహం తగ్గడం వల్ల నిర్మాణాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆధారంగా పునరుద్ధరించాలని, మిగిలిన నిర్మాణాలపై కూడా ఎన్‌డీఎస్ఏతో స్వతంత్ర సాంకేతిక అధ్యయనం నిర్వహించి గడువులోగా నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేంద్రం, ఎన్‌డీఎస్‌ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజనీర్-ఇన్-చీఫ్‌తో పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు.
