పోసాని కృష్ణమురళి లీడ్ రోల్‌లో నటిస్తూ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ‘రచయితగా వంద చిత్రాలు రాసిన నేను, నటుడిగా వందలాది చిత్రాల్లో నటించా.
దర్శకనిర్మాతగానూ సినిమాలు తీశా. నా సినిమాలు అన్నింటిలో బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చిన సినిమా ఇది. ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. బూతులు, అసభ్య సన్నివేశాలు లేకుండా సిన్సియర్‌గా తీశా. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, నిర్మాత శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్, డీవోపీ సుధాకర్ పాల్గొన్నారు.
