- ‘మహా’సర్వేకు అన్నివిధాలా సహకరించండి
- జాయింట్ అకౌంట్లో నిధులు జమ చేయాలె
- ప్రతి అభ్యంతరానికీ మన వద్ద జవాబు రెడీగా ఉండాలె
- మహా రాష్ట్ర సర్కారుకు రికార్డులన్నీ ఇచ్చేయాలి
- ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి ఆర్థిక అడ్డంకులు రాకుండా అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో ముందే జమ చేయాలని సీఎం సూచించారు. రైతులు, భూ నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం కలగకుండా పారదర్శకంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆ రాష్ట్రం లేవనెత్తే ప్రతి అభ్యంతరానికీ సంతృప్తికరమైన సమాధానం మన దగ్గర ఉండాలని, ఇందుకోసం పూర్తి సాంకేతిక సమాచారం, పక్కా వివరాలతో సిద్ధం కావాలని సూచించారు.
బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను ఇరు రాష్ట్రాల ఆధ్వర్యంలోని జాయింట్ అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్, ఇతర ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూసర్వే వివరాలు తప్పుల తడకగా ఉన్నందున ముంపు, పరిహారంపై తామే సొంతంగా సర్వే చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినట్లు ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ వెల్లడించిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.
అన్ని పత్రాలు అందజేయండి
బ్యారేజీ వల్ల మహారాష్ట్ర భూభాగంలో ఏర్పడే ముంపు పూర్తి వివరాలు, సాంకేతిక నివేదికలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ఇతర కీలక అంశాలకు సంబంధించిన అధికారిక పత్రాలన్నింటినీ మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు రాష్ట్రాల సంబంధాలు దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా ఇరిగేషన్ శాఖ చాకచక్యంగా వ్యవహరించాలన్నారు. మహారాష్ట్ర లేవనెత్తే ప్రతి అంశాన్ని సావధానంగా పరిశీలించి, సమన్వయంతో పరిష్కార మార్గాలు కనుగొనాలని చెప్పారు. బ్యారేజీ వల్ల కలిగే ప్రయోజనాలు, ముంపు నివారణకు తెలంగాణ తీసుకుంటున్న చర్యలను మహారాష్ట్ర అధికారులకు స్పష్టంగా వివరించేలా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
‘మహా’ సర్వేకు సహకరించండి
ముంపు విస్తీర్ణాన్ని తేల్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయించుకున్నా తెలంగాణకు అభ్యంతరం లేదని సీఎం తేల్చిచెప్పారు. మహారాష్ట్ర అధికారులు చేసే ఏ సర్వేకైనా ఇరిగేషన్ శాఖ పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన ప్రాజెక్టు డ్రాయింగులు, రికార్డులు, సాంకేతిక సమాచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు అందించాలన్నారు. దాపరికం లేకుండా సమాచారం పంచుకుంటేనే ఇరు రాష్ట్రాల మధ్య సందేహాలు తొలగిపోతాయని, బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగి ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులకు వివరించారు.
