- ఏపీ, కర్నాటక ప్రతిపాదనలను తిరస్కరించిన తెలంగాణ
- ఎన్‌డబ్ల్యూడీఏ జనరల్ బాడీ మీటింగ్‌లో స్పష్టీకరణ
- ఆల్మట్టి నుంచి కర్నాటకకు అదనంగా ఇవ్వొద్దని వాదన
హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి (జీసీ) లింక్‌పై ఏపీ, కర్నాటక ప్రతిపాదనలను తెలంగాణ తిరస్కరించింది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే ఇచ్చంపల్లి/సమ్మక్కసాగర్ నుంచి లింక్ చేపట్టాలని తేల్చి చెప్పింది. పోలవరం నుంచి నీటిని తరలించేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 77వ జనరల్ బాడీ మీటింగ్‌లో రాష్ట్రం ఈ వాదనలు వినిపించింది. హైబ్రిడ్ విధానంలో జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్నాటక తమ అభిప్రాయాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్ పాల్గొన్నా.. వాదనలు వినిపించలేదు.
ఏపీ వాదన ఎన్‌డబ్ల్యూడీఏ గైడ్‌లైన్స్‌కు విరుద్ధం
గోదావరి–కావేరి లింక్‌ను పోలవరం నుంచి చేపట్టాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. 2018లోనూ ఏపీ ఇలాంటి ప్రతిపాదన చేసిందని, అప్పట్లో సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ అది సాధ్యం కాదని చెప్పాయని గుర్తు చేసింది. పోలవరం నుంచి లింక్ చేపడితే తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు ప్రయోజనం ఉండదని పేర్కొంది. కేవలం ఏపీ, కర్నాటక, తమిళనాడుకే లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఎన్‌డబ్ల్యూడీఏ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లోనూ ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపు ఉంటుందని సీడబ్ల్యూసీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. జీసీ లింక్‌లో కర్నాటకకు కేటాయించే 16 టీఎంసీల నీటిపై స్పష్టమైన మెకానిజం లేదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. నీటిని ఎలా అందిస్తారో ఇప్పటివరకు చెప్పలేదని పేర్కొంది. కర్నాటక మాత్రం ఆల్మట్టి నుంచి నీటిని తీసుకుంటామని చెబుతున్నదని, అలా చేస్తే కృష్ణా బేసిన్లో తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే జూరాలకు ఇన్‌ఫ్లోలు తగ్గాయని, ఆల్మట్టి నుంచి నీటిని తరలిస్తే మరింత నష్టం జరుగుతుందని తెలిపింది. కర్నాటకకు ఆల్మట్టి నుంచి నీటిని ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.
బేడ్తి లింక్‌లో వాటా ఇవ్వాల్సిందే
బేడ్తి–హిరెవద్దట్టి లింక్ చేపడితే తమకూ వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. బచావత్ అవార్డు క్లాజ్ 14బీ ప్రకారం వాటా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. తుంగభద్ర సబ్ బేసిన్ నుంచి వచ్చే నీటితో ఈ లింక్ చేపడుతున్నందున తమ హక్కులను కాపాడాలని కోరింది. కృష్ణా బేసిన్‌లోని ఇన్బేసిన్ ప్రాజెక్టులకు అష్యూర్డ్ వాటర్స్ ఇవ్వాల్సి ఉందని గుర్తు చేసింది. జీసీ లింక్‌లో ఎక్కువ శాతం నీళ్లు వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. బేడ్తి–వార్దా లింక్‌లో తమకు వాటా ఇవ్వాలని ఏపీ కోరింది. అయితే, ఈ లింక్‌ను చేపట్టేందుకు కర్నాటక నిరాకరించింది. దానికి బదులుగా బేడ్తి–హిరెవద్దట్టి లింక్ చేపట్టాలని ప్రతిపాదించింది. ఇది రాష్ట్ర పరిధిలోని ఇంట్రాలింక్ ప్రాజెక్ట్ అని, ఇతర రాష్ట్రాలకు వాటా ఇచ్చే అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీకి కూడా వాటా ఇవ్వబోమని తేల్చి చెప్పింది. బేడ్తి–వార్దా లింక్‌లో 18 టీఎంసీలు తరలించే ప్రతిపాదన ఉండగా.. హిరెవద్దట్టి లింక్ ద్వారా 25 టీఎంసీలు తరలించాలని కర్నాటక కోరింది.
అందరూ ఒప్పుకుంటేనే ముందుకు
మూడు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అర్చనా వర్మ.. ముందుగా జీసీ లింక్ ప్రతిపాదనకు అందరూ అంగీకరించాలని సూచించారు. బేడ్తి–హిరెవద్దట్టి లింక్ ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని, దానిపై ఇప్పుడు చర్చ అవసరం లేదని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ వద్ద జరిగిన సమావేశంలో ఏపీ, కర్నాటక, తెలంగాణ సీఎంలు జీసీ లింక్‌పై చర్చించి సూత్రప్రాయంగా అంగీకరించారని గుర్తు చేశారు. అందరూ ఒప్పుకుంటేనే జీసీ లింక్ ముందుకు వెళ్తుందని, అన్ని రాష్ట్రాలకు నీటి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీనిపై మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
