- హైడ్రా చర్యలకు నిరసనగా హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల బంద్
- ఇతర ట్యాంకర్లు రావడంతో అడ్డగించి.. నీటిని వదిలేసిన వైనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పవని, ప్రతి కుటుంబం నీటి వాడకాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తున్న వేళ.. సిటీ రోడ్లపై వేల లీటర్ల నీళ్లు నేలపాలయ్యాయి. హైడ్రా, రెవెన్యూ అధికారుల చర్యలకు నిరసనగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు మంగళవారం పలుచోట్ల బంద్ పాటించారు.
బంద్ లో పాల్గొనకుండా రోడ్లపైకి వచ్చిన ట్యాంకర్లలోని నీటిని రోడ్లపై పారబోశారు. తాగునీటితో బండ్లు కడిగినా, ఫ్లోర్లు శుభ్రం చేసినా జరిమానాలు వేస్తున్న జలమండలి, నీళ్లు తరలించేటప్పుడు ట్యాంకర్ లీకైనా నవంబర్ 1 నుంచి రూ.5 వేల ఫైన్ విధిస్తోంది. నీటి వృథాను అరికట్టేందుకు ‘పానీ’ యాప్ ద్వారా ప్రజల నుంచే ఫిర్యాదులు తీసుకుంటోంది. ఇలాంటి సమయంలోనే ట్యాంకర్ల యజమానులు ఉద్దేశపూర్వకంగా నీటిని రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. ఇతర ప్రైవేట్ ట్యాంకర్లు రోడ్లపైకి రాకుండా యజమానులు అడ్డుకున్నారు. తమ సంఘం పిలుపు మేరకు అందరూ బంద్ పాటించాలని, ప్రైవేట్ ట్యాంకర్లేవీ రోడ్లపైకి రావొద్దని సూచించారు. అధికారుల చర్యలతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిటీలో చెరువుల దగ్గర అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా అధికారులు కొద్ది రోజులుగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో తమ బోర్లను కూడా అక్రమ బోర్లుగా చూపి తొలగిస్తున్నారని ట్యాంకర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చర్యలు కొనసాగుతయ్: హైడ్రా కమిషనర్
చెరువుల్లో బోర్లు వేసి అక్రమంగా నీటిని తోడి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు కొనసాగుతాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు చేసిందంతా ట్రయల్ మాత్రమేనని, తమ లక్ష్యం సమ్మర్ అని, జనవరి, ఫిబ్రవరిలో దాడులు మరింత ఉంటాయన్నారు. ఇష్టానుసారంగా బోర్లు వేసి నీటిని తోడేస్తుండటంతో చుట్టు పక్కల బోర్లు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఇవే ఉన్నాయని, చర్యలు తీసుకోకపోతే అక్రమార్కుల దందా మరింత ఎక్కువుతుందన్నారు. జంట జలాశయాలతో పాటు మూసీ ఒడ్డున కూడా బోర్లున్నాయని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
