మూడు నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం : కేంద్రమంత్రి బండి సంజయ్

మూడు నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం :  కేంద్రమంత్రి బండి సంజయ్
  •     రూ.840 కోట్లతో కరీంనగర్​ను సుందరంగా తీర్చిదిద్దుతాం

కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీమ్ కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల నిధులతో 3 నెలల్లో కరీంనగర్​ను సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మోడల్ రోడ్లు, స్కై వాక్​లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పట్టణ శివారు ప్రాంతాల్లోని గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ 47వ డివిజన్​లోని రాంనగర్ సిద్దార్థ స్కూల్ సమీపంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు, 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుంచి మోర్ సూపర్ మార్కెట్ వరకు రూ.98 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. 

స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అందించిన 100 రోజుల్లోనే యూడీఎఫ్ నిధులను తీసుకొచ్చినట్లు తెలిపారు. తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.22 వేల కోట్లు తీసుకొచ్చానన్నారు. రోడ్ల నిర్మాణం కోసమే రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గన్నేరువరం బ్రిడ్జి పనులకు సైతం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఉన్నారు.