జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులే సుప్రీం..ఏ నేత ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి

జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులే సుప్రీం..ఏ నేత ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి
  •     డీసీసీ ప్రెసిడెంట్లతో కాంగ్రెస్ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ వన్-టు-వన్ భేటీ

హైదరాబాద్, వెలుగు: పార్టీ పరంగా జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులే సుప్రీంలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు.  డీసీసీ అధ్యక్షులు తమ పరిధిలోని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే తనతో  చెప్పాలని..  నేరుగా ఏఐసీసీతోనే మాట్లాడవచ్చని చెప్పారు.   డీసీసీ అధ్యక్షుల విషయంలో ఏ నేత తలదూర్చినా, ఇబ్బంది పెట్టినా తనకు చెప్పాలని స్పష్టం చేశారు. బుధవారం ఆమె గాంధీ భవన్‌‌లో 19 మంది డీసీసీ అధ్యక్షులతో  సమావేశమయ్యారు. 

ఒక్కొక్కరికి 25 నిమిషాల పాటు సమయం కేటాయించిన నటరాజన్.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు భేటీలను కొనసాగించారు. ఈ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షుల పనితీరు, వారు ఇప్పటి వరకు చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్ఏలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న తీరు, మండల కమిటీల నియామకం, ప్రభుత్వ పథకాలపై జనం అభిప్రాయం, వాటి ప్రచారాన్ని ప్రజల్లోకి ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారనే పలు విషయాలపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యాచరణ ఉందనే దానిపై కూడా డీసీసీ అధ్యక్షులను ప్రశ్నించారు. 

కలర్ కోడింగ్‌‌తో పనితీరు రేటింగ్

ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షుల పనితీరును గుర్తించేందుకు వీలుగా ఏఐసీసీ ఇన్ చార్జీ అయిన తమిళనాడు ఎంపీ శశికాంత్ సింథాల్.. ఆయా జిల్లా అధ్యక్షులకు తగిన రంగులను కేటాయించారు. మంచిగా పనిచేసిన వారికి గ్రీన్, పనితీరు ఫర్వాలేదు అనే వారికి ఎల్లో, పనితీరు ఇంకా మెరుగుపడాలి అనే వారికి ఆరెంజ్, ఇక  పనితీరు ఏమాత్రం బాగాలేదనే వారికి రెడ్ గుర్తులు కేటాయించారు. మీనాక్షితో భేటీకి హాజరైన అధ్యక్షులు తమకు ఏ రంగు కేటాయించారనేది చూసుకుని కొందరు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు ఆందోళన చెందారు.