- దక్షిణ తెలంగాణలో స్వీప్ చేస్తాం.. ఉత్తరాన మెజార్టీ సీట్లు సాధిస్తాం
- రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం
- సిద్దిపేటలో జగ్గారెడ్డి పోటీ చేస్తే మా ఫుల్ సపోర్ట్
- ప్రెస్ మీట్‌లో మంత్రి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా అసెంబ్లీ సీట్లు పెరిగితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 117 నుంచి 120 సీట్లు గెలుచుకోవడమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, అలాగే ఉత్తర తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో జగ్గారెడ్డి గనుక పోటీ చేస్తే ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. జగ్గారెడ్డి మాస్ లీడర్ అని, పేదల మనిషిగా అందరికీ హెల్ప్ చేస్తారని, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని కొనియాడారు. జగ్గారెడ్డి అంటే రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని, రాహుల్ గాంధీ స్వయంగా ఆయన్ను ఇష్టపడుతున్నారంటే కాంగ్రెస్‌లో జగ్గారెడ్డికి ఉన్న స్థానం ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇక రాష్ట్రంలో రోడ్ల నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు రూ. 13 వేల కోట్ల నిధులను, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం మరో రూ. 7 వేల కోట్ల నిధులను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్వాలిటీ రోడ్లు వేస్తున్నామని వివరించారు. కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో పర్సనల్‌గా మాట్లాడి రాష్ట్రానికి రూ. 2 వేల కోట్ల సీఆర్‌ఐఎఫ్ నిధులు తీసుకువచ్చామని వెల్లడించారు. ఇటీవల తలెత్తిన తుంగతుర్తి నియోజకవర్గ వివాదంపై మంత్రి స్పందిస్తూ.. ఆ గొడవను జగ్గారెడ్డి చూసుకుంటారని, లోకల్ ఎమ్మెల్యే పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటారని చెప్పారు. ఆ సమస్య పరిష్కార బాధ్యతను పీసీసీ నాయకత్వం సీనియర్ నేత అయిన జగ్గారెడ్డికి అప్పగించిందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తంచేశారు.
ఈ నెల 20 లోపు పీసీసీకి రిపోర్ట్ ఇస్తా: జగ్గారెడ్డి
తుంగతుర్తి నియోజకవర్గ పంచాయితీపై ఈ నెల 20వ తేదీ లోపు పీసీసీ నాయకత్వానికి సమగ్ర నివేదిక అందిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డితో కలిసి మాట్లాడిన ఆయన, పార్టీ రూల్స్‌కు విరుద్ధంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూడు, నాలుగు మండలాలకు పార్టీ ప్రెసిడెంట్ల నియామకాలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయాన్నే తాను మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఒపీనియన్ అడిగానని జగ్గారెడ్డి చెప్పారు. అయితే తుంగతుర్తి ఇష్యూలో తాను తలదూర్చనని, ఆ విషయంలో మాట్లాడబోనని కోమటిరెడ్డి క్లియర్‌గా చెప్పినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ పరిణామాలపై కూడా తామిద్దరం కాసేపు చర్చించుకున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.
