ముషీరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలోని 20 వేల కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ధర్నాకు హాజరై ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులే గెలిపించారని, ఉద్యోగాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో నినాదంతో ఉద్యమం చేపడతామన్నారు. ఓయూ జేఏసీ నేత వినోద్ నాయక్, ఝాన్సీ, కౌశిక్, రాజు, విక్రమ్, శ్రీనివాస్, రంగా నాయక్, సాయి ప్రణీత్ పాల్గొన్నారు.
