హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ బిల్లుపై అభిప్రాయాల సేకరణ కొనసాగుతున్నది. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో రియల్ ఎస్టేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వాలు మారినా చట్టాలు మార్చకుండా ఒకే విధంగా అమలయ్యేలా పారదర్శకంగా ఉండాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థ ఈజీగా ఉండేలా చూడాలని కోరారు.
పార్క్‌ల నిర్వహణను మెరుగుపరచడం, చనిపోయిన జంతువుల డెడ్‌బాడీలను వెంటనే తొలగించడం, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయే చెత్తను క్రమం తప్పకుండా తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోలుకు అనువైన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడం, రోడ్లు, కరెంట్స్తంభాలపై ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను కఠినంగా తొలగించాలని సూచించారు. ప్రతినిధుల సూచనలను పరిశీలించి, వాటిని క్యూర్ బిల్లులో పరిగణనలోకి తీసుకుంటామని జయేష్ రంజన్ హామీ ఇచ్చారు.
