- సమాచార శాఖ కమిషనరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
హైదరాబాద్ సిటీ, వెలుగు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని సమాచార శాఖ కమిషనరేట్(ఐఅండ్‌పీఆర్) ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది జర్నలిస్టులు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఉచిత ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో అనధికారికంగా నియమించిన వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ధర్నాలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, బి.రాజశేఖర్, డీజేఎఫ్టీ ప్రధాన కార్యదర్శి మస్తాన్, టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, కార్యదర్శులు చంద్రశేఖర్, గండ్ర నవీన్, మాణిక్ ప్రభు, సలీమా, నిరంజన్, వెంకటేశ్, దామోదర్, హెచ్‌యూజే ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
