వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 20 కోట్లు, వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ. 2 కోట్లు, వంతెనల నిర్మాణానికి రూ. 100 కోట్లు, మిషన్ భగీరథ పనులకు రూ. 23 కోట్లు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
బుధవారం నూతనంగా నిర్మించిన కొత్తకోట జడ్పీ బాలికల పాఠశాల భవనాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం బాలికల పాఠశాల నూతన భవనాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదే వేదికపై కొత్తకోటకు డిగ్రీ కళాశాల, ఉర్దూ మీడియం పాఠశాల, అగ్నిమాపక కేంద్రం, నియోజకవర్గానికి రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మూసాపేట సమీపంలో రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎంను కోరారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతా రెడ్డి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు తూడి మేఘా రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు సరితా తిరుపతయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కొత్తకోట మునిసిపల్ వైస్ చైర్పర్సన్ పల్లవి సునీతా పాల్గొన్నారు.
