హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని సర్వే నెం.22లో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు వారంపాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ తరఫున ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారించారు. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని సర్వే నెం.22లో అన్ని చట్టబద్ధ అనుమతులతో బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన అనంతరం జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసు జారీ చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీ రఘురాం కోర్టుకు తెలిపారు.
నిర్మాణం హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందని నోటీసులో పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ కూడా వెలువడలేదన్నారు. కేవలం డ్రాఫ్ట్ మ్యాప్ ఆధారంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని, ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు అనుసరించాల్సిన చట్టబద్ధ విధానాన్ని పాటించకుండా జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తోందని వాదించారు. విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.
