‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే! : కేంద్ర మంత్రి బండి సంజయ్

‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే! : కేంద్ర మంత్రి బండి సంజయ్
  •     రాష్ట్ర ప్రజలంతా ఎన్యూమరేషన్ ఫాంలు తప్పకుండా ఇవ్వాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: ఓటరు లిస్ట్​ స్పెషల్ ​ఇంటెన్సివ్​ రివిజన్ (సర్)ను లైట్ తీసుకుంటే.. మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనాలని, ఎన్యూమరేషన్ ఫాంలు తప్పకుండా ఇవ్వాలని ఆయన సూచించారు.  కరీంనగర్ లో బుధవారం ‘సర్’ ఫాంను నింపి చైతన్యపురిలోని సాధన స్కూల్​లో ఉన్న బీఎల్​వోకు సమర్పించారు. అక్కడే ఆన్​లైన్​లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. 

ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫాంలను అందజేశారని అధికారులు ఆయనకు చెప్పారు. ‘ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారమ్ నింపండి.. నా దగ్గర ఓటర్ ఐడీ ఉంది.. నాకు ఏమవుతుందిలే’ అని ఇంట్లో కూర్చుంటే.. రేపు ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన తర్వాత లిస్టులో మీ పేరు గల్లంతవుతుందని సంజయ్ ​హెచ్చరించారు. సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం అన్నారు. కొన్ని చోట్ల సర్ ప్రక్రియలో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.