హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 2014 లో రూ.50 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులను 2023 నాటికి రూ.2.4 లక్షల కోట్లకు పైగా దాటించేలా కేటీఆర్ ఎంతో శ్రమించారని గుర్తుచేశారు. కానీ, రేవంత్ మాత్రం రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
బుధవారం దాసోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 15 వేల నుంచి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన కాగ్నిజెంట్ సంస్థ.. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తరలిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు చోట్లా కార్యకలాపాలు విస్తరించేందుకు గతంలో ఒప్పందాలు కుదిరినప్పటికీ.. ఇప్పుడు పూర్తిగా వైజాగ్‌కే వెళ్లేందుకు మొగ్గు చూపుతోందన్నారు.
