- పీవోకేలో పతాక స్థాయికి చేరిన అణచివేత
- ఇది వ్యవస్థీకృత దోపిడే: భారత్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్( పీవోకే)లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ అణచివేతపై రావాలాకోట్ నగరంలోని న్యూ బస్ టెర్మినల్ ఏరియాలో నిరసన తెలుపుతున్న పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలుగా పరిపాలనాపరమైన అణచివేతతో పాక్ ప్రభుత్వంపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఘర్షణలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం పీఓకేలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి, దాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేసింది. నిరాయుధులైన పౌరులపై బలగాలను ప్రయోగిస్తున్నది. దీంతో పాక్ సర్కారుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యావసరాల కొరత, పోలీసుల అనాగరిక చర్యల నుంచి తమను కాపాడటానికి అంతర్జాతీయ సమాజంతో పాటు భారతదేశం వెంటనే జోక్యం చేసుకోవాలని పీవోకే ప్రజలు వేడుకుంటున్నారు. బాధిత ప్రజలకు తక్షణ సాయం అందేలా పూంచ్, దోడా సెక్టార్ల ద్వారా ఎల్వోసీని తెరవాలని కోరారు.
పాక్ బలగాల దమనకాండ దారుణం: భారత్
పీఓకేలో జరుగుతున్న ఘర్షణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అక్కడ జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థీకృత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణకు ప్రత్యక్ష ఫలితమేనని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించింది. పాకిస్తాన్ ప్రభుత్వం స్థానిక ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా.. మహిళలు, పిల్లలపై కూడా అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగిస్తోందని మండిపడింది. ఆహారం, మందులు వంటి అత్యవసర వస్తువుల సరఫరాను అడ్డుకుంటూ నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరపడం దారుణమని పేర్గొంది. పౌరులపై జరుగుతున్న అణచివేతకు పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
వైట్ హౌస్‌కు చేరిన పీవోకే ప్రజల ఆవేదన
పీవోకేపై పాక్ సర్కార్ అణచివేత చర్య అమెరికాలోని వైట్‌హౌస్‌కు చేరింది. వాషింగ్టన్‌లో నివసిస్తున్న పీవోకే ప్రజలు మంగళవారం వైట్‌హౌస్ బయట శాంతియుత నిరసన చేపట్టారు. ఇందులో మహిళలు, పిల్లలతో సహా దాదాపు వంద మంది నిరసనకారులు పాల్గొన్నారు. పీవోకేలో పాక్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
