పగటిపూట కూడా దాడులు ప్రారంభించిన అమెరికా
ఇరాన్‌పై మళ్లీ నౌకాదళ దిగ్బంధం షురూ
అమెరికా బ్లాకేడ్‌పై ఇరాన్ ఆగ్రహం
ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరిక
కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి
భారీ పేలుడుతో ఎగిసిపడిన మంటలు
టెహ్రాన్/వాషింగ్టన్:అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లింది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాలపై అమెరికా మిసైళ్ల వర్షం కురిపించగా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు కేంద్రాలపైకి ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. మంగళవారం రాత్రి ఇరాన్‌పై ఏకధాటిగా ఏడు గంటలపాటు అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతోపాటు బుధవారం నుంచి హార్మూజ్‌లో ఇరాన్‌పై మళ్లీ నావికాదళ దిగ్బంధనాన్ని ప్రారంభించింది. అలాగే, తొలిసారిగా బుధవారం పగటిపూట కూడా ఇరాన్‌పై దాడులు చేపట్టింది. అమెరికా దాడులపై ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది.
డ్రోన్లు, మిసైళ్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాన్‌కు చెందిన షహీద్-136 డ్రోన్ కువైట్‌లోని ఒక చమురు నిల్వ కేంద్రంపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఇరాన్‌పై మంగళవారం రాత్రిపూట 7 గంటల వ్యవధిలో డజన్ల కొద్దీ లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ బుధవారం ధ్రువీకరించింది. ఆ తర్వాత, తొలిసారి పగటిపూట కూడా ఇరాన్‌పై దాడులను ప్రారంభించింది. ‘‘బుధవారం ఉదయం 6 గంటలకు అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్‌పై సరికొత్త శ్రేణి దాడులను ప్రారంభించాయి.
హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడి చేయడానికి ఇరాన్ దళాలు ఉపయోగించిన సైనిక సామర్థ్యాలను మరింత క్షీణింపజేయడానికి ఈ దాడులు చేపట్టాం’’ అని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. కాగా, ఇరాన్ 388వ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు చెందిన బ్యారక్‌లను లక్ష్యంగా చేసుకుని ఒక దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా కనీసం13 క్షిపణులను ప్రయోగించిందని, మరణించిన ఏడుగురిలో నిర్బంధ సైనిక శిక్షణలో ఉన్నవారు, సాధారణ సైనికులు ఉన్నారని పేర్కొంది. మరోవైపు బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఇరాన్ నుంచి క్షిపణులు దూసుకురావడంతో హెచ్చరిక సైరన్లు మోగాయి. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ మూడు దేశాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది.
ఇంధన ఎగుమతులను అడ్డుకుంటాం: ఇరాన్
తమ దేశంపై అమెరికా మళ్లీ నావికాదళ దిగ్బంధనం ప్రారంభించడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఈ దిగ్బంధనానికి వ్యతిరేకంగా పశ్చిమాసియా నుంచి జరిగే అన్ని
ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని ఇరాన్ సైనిక విభాగం బుధవారం హెచ్చరించింది.
వచ్చే రెండు రోజుల్లో మరిన్ని దాడులు: ట్రంప్
ఇరాన్‌పై వచ్చే రెండు రోజుల్లో అమెరికా మరిన్ని దాడులు చేస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఫాక్స్ న్యూస్
చానెల్‌తో చెప్పారు. చర్చలు పునఃప్రారంభించకపోతే వచ్చే వారానికి వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించారు.
