యూరియా కొరత తీర్చే కొత్త పాలసీ..దేశవ్యాప్తంగా 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ల ఏర్పాటు

యూరియా కొరత తీర్చే కొత్త పాలసీ..దేశవ్యాప్తంగా 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ల ఏర్పాటు
  • వారణాసికి 25 వేల కోట్ల ప్రాజెక్టులు.. ట్రాఫిక్ రద్దీని నివారించేలా రహదారులు
  • దేశవ్యాప్తంగా 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ల ఏర్పాటు
  • 10 మిలియన్ టన్నుల మేర పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం
  • ఒడిశా, జార్ఖండ్, వారణాసిలో రైలు, రోడ్డు ప్రాజెక్టులు: కేంద్రం

న్యూఢిల్లీ: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో, వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నివారించేలా రూ. 25,500 కోట్ల వ్యయంతో రెండు భారీ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 

నగరాన్ని ట్రాఫిక్ రహితంగా మార్చే లక్ష్యంతో రూ.10,998 కోట్ల వ్యయంతో 43.218 కిలోమీటర్ల మేర వరుణా నది ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇది ఎన్‌హెచ్-31ని వారణాసి రింగ్ రోడ్‌తో అనుసంధానిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం 50% తగ్గి, కాశీ రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ప్రముఖ ఘాట్లకు చేరుకోవడం సులభతరం అవుతుంది. 

గంగా నది తీరం వెంబడి 46.039 కిలోమీటర్ల మేర మరో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా గంగా నదిపై ఒక ఐకానిక్ 'కేబుల్-స్టేడ్ బ్రిడ్జి'ని కూడా నిర్మిస్తారు. ఇందుకోసం రూ.14,447 కోట్లు కేటాయించింది. దీంతోపాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా (ఎన్ఐపీయూ-2026)’ను కూడా ఆమోదించింది. 

ఈ విధానం ద్వారా 8-9 కొత్త గ్యాస్ ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేసి, అదనంగా 10 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యూరియా కొరతను అధిగమించి, దిగుమతులపై ఆధారపడకుండా భారత్‌ను స్వయంసమృద్ధిగా మార్చడమే ఈ విధానం ఉద్దేశ్యం.

ఒడిశా, జార్ఖండ్​లలో..

ఒడిశా,  జార్ఖండ్ రాష్ట్రాల్లో రూ.3,907 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పారాదీప్ -హరిదాస్‌పూర్ సెక్షన్ డబ్లింగ్,  రాజ్‌ఖర్‌స్వాన్- దంగోపాసి సెక్షన్‌లో నాలుగో రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనివల్ల 145 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విస్తరించనుంది.