న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో ఈ బృందం భేటీ అయింది. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, సీసీఐ సాధన సమితి సభ్యుల బృందం ప్రతినిధుల పాల్గొన్నారు. దాదాపు అరగంట సేపు సాగిన ఈ భేటీలో ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న ఆటంకాలను కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
1980వ దశకంలో ఏర్పాటైన ఈ ప్లాంట్ ఒకప్పుడు 6 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించి జీవనాధారంగా నిలిచిందన్నారు. ఇక్కడ రాబోయే 100 సంవత్సరాలకు సరిపడా లైమ్‌స్టోన్ (సున్నపురాయి) నిల్వలు పుష్కలంగా అందు బాటులో ఉన్నాయని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల ఈ ప్లాంట్‌ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకా శాలు సంపూర్ణంగా ఉన్నాయని వివరించారు. అనంతరం సీసీఐ పునరుద్ధరణపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే, సీసీఐ ప్లాంట్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ధి ఎంతో అవసరమన్నారు. ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో వెంటనే బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, ఆనాటి సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ కూడా ఈ ప్లాంట్‌ను తెరిపిస్తామని స్వయంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, నేడు క్షేత్రస్థాయిలో దీన్ని తెరిపించాల్సింది పోయి తుక్కు (స్క్రాప్) కింద మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీసీఐ ప్లాంట్‌ను తిరిగి తెరిపించే వరకు బీఆర్‌ఎస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
