మేళ్లచెరువు/మఠంపల్లి, వెలుగు : నకిలీ డీఏపీ అమ్ముతున్న వ్యక్తులను సూర్యాపేట జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో కోరమాండల్ బ్రాండ్ పేరుతో నకిలీ డీఏపీ అమ్ముతున్నట్లు గుర్తించిన రైతులు ఆఫీసర్లకు, సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు బుధవారం రఘునాథపాలెం గ్రామానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యక్తి డీఏపీ బస్తాలను తీసుకొచ్చి స్థానిక రైతులకు, మేళ్లచెరువు మండలం వేపలమాదారం గ్రామానికి చెందిన బద్రిశెట్టి శ్రీనుకు అమ్మినట్లు గుర్తించారు.
బద్రిశెట్టి శ్రీనును విచారించగా 381 బస్తాలను 25 మంది రైతులకు విక్రయించినట్లు తేలింది. మొత్తం సుమారు 1000 బస్తాల డీఏపీని రైతులకు అమ్మినట్లు తెలుస్తోంది. కోరమాండల్ ప్రతినిధులు వచ్చి డీఏపీ బస్తాలను పరిశీలించి నకిలీగా నిర్ధారించారు. ఇద్దరిపై మఠంపల్లి, మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు ఏడీఏ రవి వెల్లడించారు.
