ఏసీబీకి చిక్కిన సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల అధికారి..రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల అధికారి..రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టివేత

సూర్యాపేట, వెలుగు : బోరు బండి యజమాని నుంచి లంచం తీసుకున్న సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి బాలునాయక్ ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరు నెలల కింద కొత్తగా బోరు బండి కొనుగోలు చేశాడు. మెషీన్ కొనుగోలుకు, బోరు వేసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గ్రామంలో బోరు వేస్తుండగా విషయం తెలుసుకున్న గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. 

అనుమతి లేనందున రూ. 2 లక్షల వరకు జరిమానా కట్టాలని, లేదంటే తమ ఆఫీస్ ఆవరణలో ఫ్రీగా బోరు వేయాలని జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి బాలు నాయక్ పట్టుబట్టాడు. చివరకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారి వేధింపులు భరించలేని బాధితుడు నల్గొండ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు బుధవారం గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ కు వచ్చి అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లుకు రూ. 20 వేలు ఇచ్చాడు.

 అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అధికారి బాలునాయక్ సూచనతోనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఆపరేటర్ చెప్పడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలు నాయక్ నివాసంలోనూ ఏసీబీ ఆఫీసర్లు సోదాలు జరిపారు. నిందితులను గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ జగదీశ్వర్ తెలిపారు.