ఏఐ యుగంలో నైపుణ్యాభివృద్ధి తప్పనిసరి:మంత్రి వివేక్ వెంకటస్వామి

ఏఐ యుగంలో నైపుణ్యాభివృద్ధి తప్పనిసరి:మంత్రి వివేక్ వెంకటస్వామి
  • టెక్నాలజీకి అనుగుణంగా కార్మికులను సిద్ధం చేయాలి:  మంత్రి వివేక్ వెంకటస్వామి
  • విదేశాలకు వెళ్లే వలస కార్మికుల హక్కుల రక్షణకు బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయం ఉండాలి
  • అంతర్జాతీయ సహకారంతోనే కార్మికుల వలసలు సురక్షితం
  • కార్మిక సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా ఉందని వెల్లడి
  • బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సదస్సులో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్(ఏఐ), ఆటోమేషన్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో కార్మికులకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్) ఎంతో అవసరమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సదస్సులో ఆయన రెండో రోజు మాట్లాడారు. మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కార్మికులను గ్రీన్ టెక్నాలజీ, ఏఐ రంగాల్లో సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పరిశ్రమలపై ఉందని చెప్పారు. విదేశాలకు వెళ్లే వలస కార్మికుల హక్కుల రక్షణ కోసం బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సమన్వయం ఉండాలన్నారు.

కార్మికుల నైపుణ్యాల పరస్పర గుర్తింపు, సురక్షితమైన రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ విధానాలు, బదిలీ చేయదగిన (పోర్టబుల్) సామాజిక భద్రత, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలపై అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ రకమైన అంతర్జాతీయ సహకారంతోనే కార్మికుల వలసలు గౌరవప్రదంగా, సురక్షితంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గిగ్, ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ కార్మికుల హక్కుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రగతిశీలమైన రీతిలో గిగ్ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చామని వివరించారు. 

ఈ చట్టం ద్వారా అసంఘటిత రంగంలో పని చేసే గిగ్ కార్మికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, వారి సమస్యల పరిష్కారానికి బలమైన వేదిక లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టామ్‌‌‌‌‌‌‌‌కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ) రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఇప్పటివరకు 16 దేశాల్లో సుమారు 14,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించామని తెలిపారు. బ్రిక్స్ దేశాలు కార్మికుల నైపుణ్యాల గుర్తింపు, పరస్పర సహకారం దిశగా మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సాంకేతికతతో కార్మిక సంక్షేమం..

పరిశ్రమల అభివృద్ధి, కార్మిక సంక్షేమం అనేవి నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివని, ఇవి రెండూ కలిసినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. కార్మిక శాఖ సేవలను పారదర్శకంగా మార్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద బీమా, విద్యా సంబంధిత సహాయాన్ని అందజేస్తున్నామని చెబుతూనే.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బంధిత కార్మికుల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య నిరంతరం ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

పరస్పర నమ్మకం, సహకార స్ఫూర్తితో పనిచేసినప్పుడే పారిశ్రామిక రంగంలో సానుకూల మార్పులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమన్వయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. 

బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి విచ్చేసిన ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధు లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వివిధ దేశాల ప్రతినిధులు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందజేశారు.