నారాయణపేట, వెలుగు : అనివార్య పరిస్థితుల్లో నవజాత శిశువులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెత్తకుప్పల్లో వదిలివేయకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘ఊయల’లో సురక్షితంగా ఉంచాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నారాయణపేట ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఊయల’ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. వదిలేసిన శిశువుల ప్రాణాలను కాపాడి, సంరక్షణ కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
శిశువులను పెంచుకోలేని తల్లిదండ్రులు ఎలాంటి భయం, సంకోచం లేకుండా ఈ ఊయలలో వదిలి వెళ్లవచ్చని, ఇక్కడ లభించే పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ పూర్తి బాధ్యతతో సంరక్షించి, నిబంధనల ప్రకారం దత్తత కోరే అర్హులైన దంపతులకు చట్టబద్ధంగా అందజేస్తుందని వివరించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య, డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, డీసీపీఓ కరిష్మా పాల్గొన్నారు.
