మనోహరాబాద్, వెలుగు : అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన జగదీశ్ పరికిబండ గ్రామ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని డోమెస్టిక్ సిలిండర్ల నుంచి ఇతర సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుంటాడు.
మంగళవారం రాత్రి రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో అక్కడే పని చేస్తున్న బిహార్ కు చెందిన రాజేశ్ కుమార్, లాలన్ కుమార్ మహతో, ధరంనాథ్ మహతో, గంగారం మహతో, సంజయ్ కుమార్ మహతో తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన ఐదుగురిని తూప్రాన్ ప్రభుత్వ హాస్పిటల్ కు అక్కడి నుంచి కొంపల్లిలోని హాస్పిటల్ కు తరలించారు. లాలన్ కుమార్, సంజయ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బలరాం మహతో ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
