మెడికల్ బోర్డు పెట్టకుంటే 20 నుంచి దీక్ష..డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు: కవిత

మెడికల్ బోర్డు పెట్టకుంటే 20 నుంచి దీక్ష..డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు: కవిత

హైదరాబాద్, వెలుగు: సింగరేణి మెడికల్​బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని.. లేదంటే ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష చేపడతానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్​) చీఫ్​కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు హక్కు భుక్తంగా ఉండాలని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు ఎముకలు వంకర పోయే వరకు సమాజానికి సేవ చేస్తారని, అందుకే వాళ్లు అనుకున్న వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చుకునే హక్కు ఉండాలని చెప్పారు. ‘‘రిటైర్ మెంట్ కు దగ్గర్లో ఉన్న కార్మికులు ఆందోళన చెందవద్దు. 

మీరు డిపెండెంట్ ఉద్యోగాల కోసం పెట్టుకున్న డేట్ నే ప్రామాణికంగా తీసుకునేలా పోరాటం చేస్తాం. ఇప్పుడు గెలిచిన సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాలను గంగలో కలుపుతున్నా అడగటం లేదు.  మొన్న మేము బాయిబాట పేరుతో సింగరేణి కార్మికులను కలవటంతో అన్ని పార్టీల వాళ్లు వస్తున్నారు. కానీ, వాళ్లు మెడికల్ బోర్డు అడగటం లేదు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలన్నీ క్లియర్ అయ్యే వరకు నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. ఆ తర్వాత నెలకు ఒక్కసారి కచ్చితంగా నిర్వహించాలి. మేం బాయిబాట పట్టగానే కిషన్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు. తాడిచర్ల గని ఇవ్వటమే గొప్ప అని చెప్పుకుంటున్నారు. 

కానీ, ఇంకా 17 బొగ్గు బాయిలు బేషరతుగా ఇవ్వాల్సి ఉంది. వాటిని ఇవ్వండి’’ అని ఆమె డిమాండ్​ చేశారు. రైతుల నుంచి వడ్లు కొనకుండా ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, 8 నుంచి 10 కిలోలు తరుగు తీసి రూ.2 వేల కోట్ల స్కామ్​ చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ చిన్న రైస్ మిల్లర్లపై పడి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. పెద్ద రైస్ మిల్లర్లతో కేటీఆర్, హరీశ్ రావు కుమ్మక్కయ్యారని అందుకే వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడడం లేదని ఆరోపించారు. ఇటు పెద్ద మిల్లర్లే మంత్రుల కార్లలో తిరుగుతుంటే ఏం సందేశం ఇస్తున్నట్టు? అని ప్రశ్నించారు. కాగా, 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు కవిత పార్టీ ఇన్​చార్జీలను నియమించారు.