- ఈ దిశగా అధికారులను ఆదేశించాలంటూ విజ్ఞప్తి
- లేకుంటే మరో రెండు రోజుల్లో ఆయన చనిపోతారని ఆందోళన
- 18వ రోజుకు చేరిన వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
- మద్దతుగా నేడు సామూహిక దీక్ష.. 20న ‘చలో సంసద్’కు సీజేపీ పిలుపు
న్యూఢిల్లీ:నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఆయనను వెంటనే రక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక అత్యవసర పిల్ దాఖలైంది. ఆయన ఇలాగే నిరాహార దీక్షను కొనసాగిస్తే మరో రెండు రోజులకు మించి బతికే అవకాశంలేదని పిల్ వేసిన న్యాయవాది రాకేశ్ కుమార్ సైనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం 59 ఏండ్ల వయసున్న వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, లిక్విడ్ డైట్ ద్వారా అవసరమైన పోషకాలను బలవంతంగానైనా అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ పిల్‌పై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది.
‘ఆయన్ను చావనివ్వకండి’
ప్రజాస్వామ్య దేశంలో బహిరంగ ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని రాకేశ్ కుమార్ సైనీ వాదించారు. ‘‘ఒక పౌరుడు తన కళ్లెదుటే ఆకలితో అలమటించి ప్రాణాలు విడుస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి న్యాయస్థానాలు అంగీకరించవు. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే అది దేశానికే తీరని అవమానం’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం ఒక కరడుగట్టిన నేరస్తుడిలా, దేశద్రోహిలా చూస్తోందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత పెద్ద సమస్యపై దీక్ష చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం ఖండించదగిన విషయమన్నారు.
కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తున్నది: దీప్కే
నిరసనకారులతో చర్చలు జరపడానికి నిరాకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజీత్ దీప్కే మండిపడ్డారు. వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఈ నెల16న సామూహిక దీక్షకు, ఈ నెల 20న ‘చలో సంసద్’ (పార్లమెంట్ మార్చ్)కు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ పోరాటానికి ఏఐఎస్‌ఏ విద్యార్థి సంఘాలతో పాటు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎంపీ శశి థరూర్‌లాంటి ప్రముఖ రాజకీయ నేతలు, నటీమణులు జీనత్ అమన్, స్వరా భాస్కర్, రుబీనా దిలాయక్, షబానా అజ్మీ, నటుడు నసీరుద్దీన్ షా, కమెడియన్, ర్యాపర్ మునవర్ ఫారూఖీ తదితరులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా, సోనమ్ వాంగ్‌చుక్‌తో గురువారం సాయంత్రం 4 గంటలకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే సంజీవ్ ఝా వెల్లడించారు.
