లంచం అడిగితే ‘ఇవ్వం’ అని చెప్పండి : తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌

లంచం అడిగితే ‘ఇవ్వం’ అని చెప్పండి : తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌
  •     అయినా వేధిస్తే ‘ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది మా విజయ్!’ అని హెచ్చరించండి
  •     నేను మీకు అండగా ఉంటా: తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌

కరూర్: తమిళనాడులో అవినీతి, లంచగొండితనం, అధికార దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం, టీవీకే అధినేత విజయ్ స్పష్టం చేశారు. కరూర్‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎవరైనా లంచం అడిగితే నేరుగా మొహం మీదే ‘మేము ఇవ్వం’ అని ధైర్యంగా చెప్పండి. ఆ తర్వాత కూడా బలవంతం చేస్తే.. ‘ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది మా కొడుకు, మా సోదరుడు, మా విజయ్!’ అని గట్టిగా చెప్పండి. 

నేను మీకు అండగా ఉంటాను”అని ప్రజలకు పిలుపునిచ్చాడు. అవినీతికి పాల్పడేవారు, లంచాలు డిమాండ్ చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  ప్రజలు తన వెంట ఉన్నంత కాలం రాష్ట్రంలో అవినీతిపరుల ఆటలుసాగవన్నారు. తాను కూడా సామాన్య కుటుంబం నుంచే వచ్చానని, పేదరికం, ఆకలి అంటే ఏంటో తనకు తెలుసని, ప్రజల సొమ్మును తాకనని విజయ్ స్పష్టం చేశారు. తన చుట్టూ ఉన్నవారిని కూడా తాకనివ్వనన్నారు. 

బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు 

గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో కరూర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ  విషాద ఘటన తర్వాత విజయ్ ఈ జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాటి విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. అది తన గుండెల్లో ఎప్పటికీ మానిపోని గాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చెందిన 31 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అలాగే బాధితుల జ్ఞాపకార్థం కరూర్‌‌‌‌లో స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కరూర్ సమీపంలోని మనవాసి వద్ద రూ.1,700 కోట్లతో ఏర్పాటు కానున్న ‘ఎవర్‌‌‌‌వాన్ కొఠారి ఫుట్‌‌‌‌వేర్’ పరిశ్రమకు విజయ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

తిప్పికొట్టిన ప్రతిపక్ష పార్టీ 

విజయ్ చేసిన అవినీతి నిర్మూలన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత టి.కె.ఎస్. ఇలంగోవన్ మాట్లాడుతూ.. విజయ్ పార్టీలోనే అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీవీకే లీగల్ సెల్ నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదే పార్టీకి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారని ఇలంగోవన్ పేర్కొన్నారు. దీనికి సీఎం విజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.