టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా షట్లర్లు నిరాశపర్చారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 16–21, 14–21తో కొకి వాట్నాబే (జపాన్) చేతిలో ఓడాడు. ఫలితంగా జపాన్ ప్లేయర్ ముఖాముఖి రికార్డును 4–3కు పెంచుకున్నాడు. 38 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. 1–1తో స్కోరు సమమైన తర్వాత లక్ష్య వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు.
బలమైన స్మాష్‌లు, ర్యాలీలు ఆడిన వాట్నాబే వరుసగా పాయింట్లు రాబట్టాడు. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్న లక్ష్య 5–5తో పోరాటం మొదలుపెట్టాడు. కానీ వాట్నాబే బలమైన క్రాస్ కోర్టు విన్నర్లు ముందు ఇండియన్ ప్లేయర్ తేలిపోయాడు. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గిన వాట్నాబే 11–5తో వెనుదిరిగి చూసుకోలేదు. మరో మ్యాచ్‌లో ఆయుష్ షెట్టి 19–21, 25–23, 15–21తో కున్లావట్ వితిదర్సన్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21–16, 16–21, 15–21తో హుయాంగ్ యు సున్ (చైనీస్‌తైపీ) చేతిలో కంగుతిన్నది.
