వన్డే, టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో భారీ మార్పులు.. కొత్త ఫార్మాట్లు ప్రకటించిన ఐసీసీ

వన్డే, టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో భారీ మార్పులు.. కొత్త ఫార్మాట్లు ప్రకటించిన ఐసీసీ

ఎడిన్‌‌బర్గ్‌‌: వన్డే, టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు సంబంధించి ఐసీసీ కొత్త ఫార్మాట్లను ప్రకటించింది. 2027 వరల్డ్‌‌ కప్‌‌లో సూపర్‌‌–7 దశను, 2028 టీ20 ప్రపంచ కప్‌‌లో సూపర్‌‌–8 ప్లేస్‌‌లో సూపర్‌‌–10 దశను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బుధవారం ఎడిన్‌‌బర్గ్‌‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సౌతాఫ్రికా ఆతిథ్యమిచ్చే 2027 వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో మొత్తం 14 జట్లు తలపడతాయి. 

ఇందులో మూడంచెల పోటీలు జరుగుతాయి. లోయర్‌‌ ర్యాంక్‌‌ల్లోని మూడు టీమ్‌‌లు సూపర్‌‌ సిరీస్‌‌ రౌండ్‌‌లో తలపడతాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు రెండో రౌండ్‌‌కు చేరుకుంటుంది. రౌండ్‌‌–2లో మొత్తం 12 టీమ్స్‌‌ ఉంటాయి. ఇవి ఆరేసి జట్లుగా విడిపోయి రెండు గ్రూప్‌‌లుగా తలపడతాయి. మొత్తం 30 మ్యాచ్‌‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌‌ నుంచి టాప్‌‌–3తో పాటు రెండు గ్రూప్‌‌ల్లో అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌ చూపెట్టిన టీమ్‌‌తో కలిసి సూపర్‌‌ –7 దశకు చేరుకుంటాయి. 

ఇందులో 21 మ్యాచ్‌‌లు ఉంటాయి. టాప్‌‌–4 టీమ్స్‌‌ సెమీస్‌‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నెగ్గిన జట్లు ఫైనల్లో తలపడతాయి. టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో మొత్తం 20 జట్లు ఉంటాయి. తొలి స్టేజ్‌‌లో నాలుగేసి టీమ్‌‌లు ఐదు గ్రూప్‌‌లుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూప్‌‌ నుంచి టాప్‌‌–2 జట్లు సూపర్‌‌–10కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ఒక్కో గ్రూప్‌‌లో ఐదు జట్లు ఉంటాయి. ఈ రెండు గ్రూప్‌‌లో టాప్‌‌–4లో నిలిచిన టీమ్స్‌‌ సెమీస్‌‌కు,  ఇందులో నెగ్గిన రెండు జట్లు ఫైనల్లో ఆడతాయి.