Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భవిష్యత్తులో జాతీయ జట్టును పూర్తి స్థాయిలో నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ 270 రన్స్ తేడాతో విజయం సాధించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్లలో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో సారథ్య బాధ్యతల మార్పుపై జరుగుతున్న డిస్కషన్ నేపథ్యంలో మంధాన కామెంట్స్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
స్మృతి మంధాన కామెంట్స్ వైరల్:
మహిళల క్రికెట్ చరిత్రలోనే లార్డ్స్ మైదానంలో జరిగిన మొట్ట మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు 270 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన (తొలి ఇన్నింగ్స్‌లో 83, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు) మ్యాచ్ అనంతరం లార్డ్స్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్‌లో భాగం కావడం, అంతకంటే ముఖ్యంగా అందులో గెలవడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. చిన్నప్పటి నుంచి మనమంతా టెస్ట్ క్రికెట్ ఆడాలని కలలు కంటాం, అలాంటిది లార్డ్స్ వేదికగా ఈ చారిత్రాత్మక గెలుపులో నా వంతు పాత్ర పోషించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
నేను కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాను:
భవిష్యత్తులో హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేనప్పుడు లేదా సారథ్య బాధ్యతల్లో మార్పులు చేసినప్పటికీ, భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు స్మృతి మంధాన స్పందిస్తూ.. అవును, తప్పకుండా నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు జట్టును నడిపించడం ప్రతి ఒక్కరి కల, అలాంటి అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తానని వెల్లడించింది. అలాగే జట్టులో సానుకూల వాతావరణం నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యం, ప్లేయర్స్ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావరణం ఉన్నప్పుడే వారు మంచి ప్రదర్శన చేయగలరని ఆమె వెల్లడించింది.
►ALSO READ | లంకా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ రిలీజ్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్, కొత్త రూల్స్ ఇవే!
కెప్టెన్సీలో స్మృతి మంధాన ట్రాక్ రికార్డు:
మంధానకు కెప్టెన్సీ బాధ్యతలు కొత్తేమీ కాదు.. గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేని పలు సందర్భాల్లో ఆమె టీమిండియాని విజయవంతంగా నడిపించింది. మందాన నాయకత్వంలో ఆడిన 4 వన్డేలలోనూ భారత్ 100 శాతం విజయాల రికార్డుతో అజేయంగా నిలిచింది. అలాగే 18 టీ20 ఇంటర్నేషనల్స్ లో జట్టుకు నాయకత్వం వహించి 11 విజయాలను అందించారు. కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 సీజన్లలో విజేతగా నిలిపి తన అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను నిరూపించుకుంది.
భవిష్యత్తు సారథిగా మంధానకు ఫుల్ సపోర్ట్:
గత కొన్నేళ్లుగా ఒత్తిడి సమయాల్లోనూ ఎంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, సీనియర్ బ్యాటర్‌గా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న మంధాన భవిష్యత్తు టీమిండియా కెప్టెన్సీ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో జట్టు పగ్గాలు మార్చాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధ్యతలు స్వీకరించడానికి స్మృతి మంధాన లాంటి సమర్థురాలైన వైస్ కెప్టెన్ సిద్ధంగా ఉండటం భారత్ కి లభించిన అతిపెద్ద సానుకూలాంశం అని చెప్పాలి.
