ఇరాన్ పై పట్టపగలే విరుచుకుపడిన అమెరికా : గల్ఫ్ మొత్తానికి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

ఇరాన్ పై పట్టపగలే విరుచుకుపడిన అమెరికా : గల్ఫ్ మొత్తానికి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

ఇరాన్ పై మరో సారి తీవ్రంగా దాడులు చేస్తుంది అమెరికా. పట్టపగలు.. ఉదయాన్నే ఈ దాడులు చేయటం ఇరాన్ దేశానికి ఊహించని షాక్. ఇరాన్ దేశ వ్యాప్తంగా ఉన్న ఓడరేవులపైనే కాకుండా.. హర్మూజ్ జల సంధి సమీపంలో ఉన్న ఓడరేపులపై డ్రోన్ బాంబులతో విరుచుకుపడింది అమెరికా. 

2026, జూలై 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచే ఈ దాడులు మొదలుపెట్టాం అని.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా సెంట్రల్ కమాండ్. హర్మూజ్ జలసంధి మీదుగా వెళుతున్న ఆయిల్ నౌకలపై దాడి చేయటానికి ఇరాన్ దళాలు ఉపయోగిస్తున్న సైనిక స్థావరాలను నాశనం చేయటం.. ఆ సైనిక స్థావరాల్లోని ఆయుధాలను ధ్వంసం చేయటం లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. 

గ్రేటర్ తున్బ్ ద్వీపం లక్ష్యంగా ఈ దాడులు చేసింది అమెరికా. ఆ ద్వీపంలో ఇరాన్ రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు ఉన్నట్లు చెబుతుంది అమెరికా. వాటిని ధ్వంసం చేయటం ద్వారా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయొచ్చన్న లక్ష్యంతోనే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. 

►ALSO READ | భారత్-యూకే డీల్ అమల్లోకి..కార్లు, చాక్లెట్లు, బిస్కెట్లు చౌక.. భారత వస్తువులకు బ్రిటన్ మార్కెట్ ఓపెన్!

హర్మూజ్ జల సంధిని శాశ్వతంగా మూసి వేయటంతోపాటు పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్.. IRGC ప్రకటించిన 24 గంటల్లోనే ఈ దాడులు చేసింది అమెరికా. 

ఇరాన్ దేశంపై ఎగుమతుల ఆంక్షలు తొలగించే వరకు.. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులను పూర్తిగా అడ్డుకుంటామని IRGC ప్రకటించిన తర్వాత అమెరికా తన దాడుల తీవ్రతను పెంచింది. ఇన్నాళ్లు రాత్రి సమయాల్లోనే దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు పట్టపగలు బాంబులతో విరుచుకుపడుతుంది. 

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన 24 గంటల్లోనే.. హర్మూజ్ నుంచి వెళ్లాల్సిన 2 నౌకలను అడ్డుకున్నాయి ఇరాన్ దళాలు. హర్మూజ్ జల సంధిని పూర్తిగా మూసివేస్తామని.. అదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులను అడ్డుకుంటామని మరోసారి హెచ్చరించింది ఇరాన్. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్, ఎరువులు, నిత్యావసరాల ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం లేకపోలేదని పశ్చిమాశియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.