ముంబై ఇండియన్స్‌‌‎లో భారీ మార్పులు.. హార్దిక్‌ ఔట్.. కెప్టెన్సీ రేసులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్..!

ముంబై ఇండియన్స్‌‌‎లో భారీ మార్పులు.. హార్దిక్‌ ఔట్.. కెప్టెన్సీ రేసులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్..!

ముంబై: ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌‌ తమ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది. ఈ మేరకు గత సీజన్‌‌ పెర్ఫామెన్స్‌‌పై రివ్యూ చేసేందుకు ముంబై యాజమాన్యం వచ్చే వారం లండన్‌‌లో సమావేశం కానుంది. ఇందులో హార్దిక్‌‌ పాండ్యా కెప్టెన్సీపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే పాండ్యా ముంబైని వీడుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్‌‌ వేటను కూడా మొదలుపెట్టబోతున్నారు. 

ఈ క్రమంలో తెలుగు బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మ, పేసర్‌‌ జస్ప్రీత్‌‌ బుమ్రా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనుభవం, నైపుణ్యం కారణంగా బుమ్రా వైపే యాజమాన్యం మొగ్గుచూపుతున్నా.. తరచు గాయాల బారిన పడటం పేసర్‌‌కు మైనస్‌‌గా మారే అవకాశం ఉంది. భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకుంటే తిలక్‌‌ వర్మకే చాన్స్‌‌ దక్కొచ్చనే చర్చ కూడా మొదలైంది. 

తిలక్‌‌ను కేంద్రంగా చేసుకుని యంగ్‌‌స్టర్స్‌‌తో కూడిన కొత్త జట్టును నిర్మించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. 2022లో ముంబైలో చేరినప్పట్నించి తిలక్‌‌ ప్రతి సీజన్‌‌లో 300లకు పైగా రన్స్‌‌ చేశాడు. మరోవైపు హార్దిక్‌‌ను ట్రేడ్‌‌ చేసుకునేందుకు చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సీఎస్కేకు వెళ్లాలని హార్దిక్‌‌ యోచిస్తున్నట్లు క్రికెట్​వర్గాలు వెల్లడించాయి.